కేవలం SIP ఉంటే సరిపోదు.. మీ సంపదను కాపాడే 'మినిమాక్స్' సూత్రం మీకు తెలుసా?
చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఒకే మాట చెబుతుంటారు.. "నెలకు 10 వేల రూపాయల SIP చేయండి, దానిని ప్రతి ఏటా 15 శాతం పెంచుకుంటూ వెళ్లండి, 15 ఏళ్లలో మీరు కోటీశ్వరులు అయిపోతారు". అయితే ఇది ప్రాక్టికల్ గా కుదరకపోవచ్చు అంటున్నారు నిపుణులు. కోటి రూపాయల లక్ష్యం కోసం కొన్ని ప్రాక్టికల్ కాలిక్యులేషన్స్ ఉండాలంటున్నారు అవేంటంటే..
నెలకు పది వేలు లేదా పదిహేను వేలు SIP చేయడం ద్వారా రూ.కోటిని సంపాదించడం అనేది కాలిక్యులేషన్ ప్రకారం నిజమే కావొచ్చు. కానీ, వాస్తవ ప్రపంచంలో ఈ లక్ష్యాన్ని చేరుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే జీవితం ఒక స్థిరమైన కాలిక్యులేటర్ కాదు. అది అనేక మలుపులతో కూడిన ఒక డైనమిక్ గేమ్. మీరు కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం పెట్టుబడి పెడితే సరిపోదు, మూడు ముఖ్యమైన గేమ్ స్ట్రాటజీలను అర్థం చేసుకోవాలి.

1. మినిమ్యాక్స్ వ్యూహం
మొదటిది 'మినిమాక్స్' (Minimax) వ్యూహం. ఇది చెస్ ఆటలో ఎక్కువగా కనిపిస్తుంది. గెలవడానికి ప్రయత్నించే ముందు, అసలు ఓడిపోకుండా ఉండటం ఎలాగో నేర్చుకోవడమే ఈ సూత్రం. చెస్‌లో మీ రాజును కోల్పోతే ఆట ముగిసిపోతుంది. మీ ఆర్థిక జీవితంలో కూడా ఒక చిన్న పొరపాటు మీ మొత్తం సంపదను దెబ్బతీస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతున్నాడు. కానీ, తన తండ్రికి లేదా కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. హఠాత్తుగా అనారోగ్యం పాలై సర్జరీ అవసరమైతే, ఆ భారీ ఖర్చు కోసం తను కష్టపడి దాచుకున్న ఈక్విటీ పోర్ట్‌ఫోలియోను లేదా SIP డబ్బును వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అంటే అక్కడ తను చేస్తున్న పొరపాటు పెట్టుబడిలో లేదు, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఉంది. కాబట్టి గెలవడానికి ముందు మీ రక్షణ కవచాలను (Insurance) సిద్ధం చేసుకోవడమే అసలైన మినిమాక్స్ స్ట్రాటజీ.
2. బ్యాక్‌వర్డ్ ఇండక్షన్..
రెండవది 'బ్యాక్‌వర్డ్ ఇండక్షన్' (Backward Induction). ప్రపంచ స్థాయి చెస్ గ్రాండ్‌మాస్టర్లు తమ కాయిన్స్‌ను ఇష్టమొచ్చినట్లు కదపరు. వారు ముందుగా ఎండ్ గేమ్‌ను (End Game).. అంటే తాము గెలవాల్సిన పొజిషన్‌ను ఊహించుకుని, అక్కడి నుండి వెనక్కి లెక్కలు వేస్తూ తమ ప్రస్తుత మూవ్ ను నిర్ణయించుకుంటారు. చాలామంది ఇన్వెస్టర్లు చేసే తప్పు ఏమిటంటే.. 2 లేదా 3 ఏళ్లలో ట్రిప్ వెళ్లడానికి ఈక్విటీలో SIP మొదలుపెడతారు. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఆ సమయంలో నెగటివ్ రిటర్న్స్ వస్తే నిరాశ చెందుతారు. నిజానికి ఈక్విటీ అనేది 7 ఏళ్లకు పైగా కాలపరిమితి ఉన్నప్పుడే సురక్షితం. మీ లక్ష్యం ఏమిటి? అది ఎప్పుడు కావాలి? అని ముందుగా నిర్ణయించుకుని, అక్కడి నుండి వెనక్కి వచ్చి ఏ అసెట్ క్లాస్‌లో (డెట్, గోల్డ్ లేదా ఈక్విటీ) పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవడమే తెలివైన పని.
3. మెకానిజం డిజైన్..
మూడవది 'మెకానిజం డిజైన్' (Mechanism Design). ఇది కటాన్ (Catan) అనే బోర్డ్ గేమ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సమాజంలో లేదా ఆర్థిక వ్యవస్థలో ప్రజలు డబ్బు లేదా బంగారం ఒకే చోట నిల్వ చేస్తే (Hoarding).. అది ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారుతుంది. ప్రభుత్వం ఇటువంటి సమయాల్లో నిబంధనలను మారుస్తూ ఉంటుంది. ఒకప్పుడు మన తల్లిదండ్రుల కాలంలో ఎఫ్‌డీలపై 12 శాతం వడ్డీ వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేదు. అలాగే భారతీయులు ఫిజికల్ గోల్డ్ ఎక్కువగా దాచుకోవడం గమనించి.. ప్రభుత్వం 'సోవరీన్ గోల్డ్ బాండ్స్' (SGB) వంటి కొత్త మెకానిజంను తెచ్చింది. మారుతున్న ప్రభుత్వ నిబంధనలను, పాలసీలను గమనిస్తూ మీ పెట్టుబడి వ్యూహాలను మార్చుకోవడం వల్ల మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు.. 'నాలుగు బర్నర్ల' సూత్రం!
చివరగా ఒక ముఖ్యమైన విషయం.. 'రిగ్డ్ మోనోపోలీ' అనే ఒక ప్రయోగం మనకు ఒక అద్భుతమైన పాఠం నేర్పుతుంది. అదృష్టం కొద్దీ లేదా అనుకోకుండా బాగా డబ్బు సంపాదించిన వారు.. అది అంతా తమ సొంత తెలివితేటల వల్లే వచ్చిందని, తాము దానికి అర్హులమని గర్వపడుతుంటారు. కానీ, గుర్తుంచుకోండి, జీవితం అంటే కేవలం బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే కాదు.
మన జీవితాన్ని ఒక స్టవ్ అనుకుంటే, దాని మీద నాలుగు బర్నర్లు వెలుగుతున్నట్లు ఊహించుకోండి:
- డబ్బు (కెరీర్)
- మానసిక ఆరోగ్యం
- శారీరక ఆరోగ్యం
- బంధుత్వాలు (రిలేషన్‌షిప్స్)
చాలా మంది ఏం చేస్తారంటే.. కోటి రూపాయల లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలనే పిచ్చితో మిగిలిన మూడు బర్నర్లను (ఆరోగ్యం, ప్రశాంతత, బంధాలు) ఆర్పేస్తారు. కేవలం డబ్బు మీద మాత్రమే ఫోకస్ పెడతారు. కానీ, తీరా ఆ లక్ష్యం చేరాక వాళ్లకి ఎదురయ్యేదే 'అరైవల్ ఫాలసీ'. అంటే, చేతిలో కోట్లు ఉన్నా.. అప్పటికే ఆరోగ్యం పాడైపోయి ఉండటం వల్లో లేక పక్కన తోడుగా ఎవరూ లేకనో ఆ డబ్బు వాళ్లకి అస్సలు ఆనందాన్ని ఇవ్వదు. "ఇంత సంపాదించి ఏం లాభం?" అనే వెలితి ఉండిపోతుంది.
అందుకే SIP చేస్తూ కోటీశ్వరులు అవ్వడం అంటే కేవలం అంకెలను పెంచుకోవడం కాదు. మీ ఆరోగ్యాన్ని, కన్నవారిని, స్నేహితులను కాపాడుకుంటూ.. సరైన ప్లానింగ్‌తో గమ్యాన్ని చేరడమే అసలైన విజయం. ఉన్నదానితో తృప్తి పడుతూనే, తెలివైన వ్యూహాలతో ముందుకు సాగడం నిజమైన ఆర్థిక ఎదుగుదల!


Click it and Unblock the Notifications