ఆర్థిక స్వాతంత్య్రం పొందాలనుకునే ప్రతి ఇన్వెస్టర్ కల.. తన పోర్ట్‌ఫోలియోలో కనీసం రూ.కోటి (1 crore)ఉండాలని. కానీ, అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్ల నుంచి దిగ్గజ కుబేరుల వరకు అందరూ చెప్పే మాట ఒక్కటే.. "మొదటి కోటి రూపాయలు సంపాదించడమే అన్నిటికంటే పెద్ద సవాల్". ప్రముఖ ఇన్వెస్టర్ చార్లీ మంగర్ సైతం ఈ విషయాన్ని పలుమార్లు నొక్కి చెప్పారు. ఒక్కసారి ఈ మ్యాజిక్ నంబర్‌ను చేరుకుంటే, ఆ తర్వాత ప్రయాణం చాలా వేగంగా సాగుతుంది. అసలు మొదటి కోటి చేరుకోవడం ఎందుకు కష్టమో, ఆ తర్వాత కాంపౌండింగ్ ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం.

మొదటి మెట్టు ఎప్పుడూ భారమే!
మీరు సున్నా నుంచి ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టినప్పుడు, ప్రతి రూపాయి మీ శ్రమ నుంచి రావాలి. అంటే మీరు పొదుపు చేసే మొత్తమే మీ సంపదను పెంచుతుంది. ప్రారంభంలో మీ పెట్టుబడిపై వచ్చే రాబడి (Returns) చాలా తక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు, మీరు రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి 12% లాభం పొందితే, మీకు వచ్చేది రూ. 1.2 లక్షలు మాత్రమే. కానీ మీరు రూ. కోటి (1 crore) మైలురాయికి చేరుకున్నాక, అదే 12% రాబడి మీకు ఏకంగా రూ. 12 లక్షలను తెచ్చిపెడుతుంది. అంటే మీరు కష్టపడకుండానే మీ డబ్బు మీ కోసం సంపాదించడం మొదలుపెడుతుంది.
కాంపౌండింగ్ మ్యాజిక్ ఎప్పుడు మొదలవుతుంది?
కాంపౌండింగ్ అనేది ఒక మంచు బంతి (Snowball) లాంటిది. కొండపై నుంచి అది కిందకు పడేటప్పుడు ప్రారంభంలో నెమ్మదిగా, చిన్నదిగా ఉంటుంది. కానీ దూరం పెరిగేకొద్దీ అది వేగంగా మారుతూ పెద్దదిగా అవుతుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీలో కూడా మొదటి 10-15 ఏళ్లు మీ డబ్బు చాలా నెమ్మదిగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే, ఆ రూ.కోటి మార్కును దాటిన తర్వాత, వడ్డీ మీద వడ్డీ తోడై మీ సంపద ఊహించని వేగంతో పెరుగుతుంది. అందుకే మొదటి కోటిని 'క్రిటికల్ మాస్' అని పిలుస్తారు. ఆ స్థాయికి చేరుకునే వరకు ఓపిక పట్టడమే అసలైన సక్సెస్.
ఎంత కాలం పడుతుంది?
మీరు నెలకు ఎంత పొదుపు చేస్తున్నారు , మీకు వచ్చే రాబడి శాతం ఎంత అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు నెలకు రూ. 25,000 చొప్పున 12% రాబడి ఇచ్చే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మొదటి కోటి చేరుకోవడానికి సుమారు 15-16 ఏళ్లు పడుతుంది. కానీ, ఆ తర్వాత రెండో కోటిని చేరుకోవడానికి కేవలం 4-5 ఏళ్లు మాత్రమే పడుతుంది. మూడో కోటి కేవలం 3 ఏళ్లలోనే వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కాలం గడిచేకొద్దీ డబ్బు పెరిగే వేగం పెరుగుతుంది.
ఇన్వెస్టర్లు చేయాల్సిన పనులు
చాలామంది ఇన్వెస్టర్లు మొదటి 5-6 ఏళ్లలో పెద్దగా లాభాలు కనిపించకపోయేసరికి ఇన్వెస్ట్‌మెంట్ ఆపేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. మొదటి రూ.కోటి చేరుకునే వరకు క్రమశిక్షణతో ఉండటం ముఖ్యం. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని, మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రతి ఏటా కనీసం 10% పెంచుకుంటూ పోతే (Step-up SIP), మీరు అనుకున్న సమయం కంటే ముందే ఆ మైలురాయిని చేరుకోవచ్చు. మార్కెట్ ఒడిదుడుకులకు భయపడకుండా దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకు సాగాలి.
మొదటి కోటి రూపాయల ప్రయాణంలో మీ శ్రమ 80% ఉంటే, మార్కెట్ ఇచ్చే రాబడి 20% మాత్రమే ఉంటుంది. కానీ ఆ తర్వాత పరిస్థితులు లకిందులవుతాయి. మీ డబ్బు 80% కష్టపడితే, మీరు కేవలం 20% పర్యవేక్షిస్తే సరిపోతుంది.
ఏదేమైనా కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవడానికి సంకల్పం, ఓపిక , క్రమబద్ధమైన పెట్టుబడి చాలా అవసరం. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా నిలబడితే, ఆర్థిక విజయం మీ సొంతమవుతుంది. ఆ మొదటి కోటి మీ తదుపరి కోట్ల ప్రయాణానికి బలమైన పునాదిగా మారుతుంది.


Click it and Unblock the Notifications