VPF: సేఫ్టీ, వడ్డీ విషయంలో మార్కెట్లో దీన్ని మించిన స్కీమ్ లేదు! ఉద్యోగులు అస్సలు మిస్ చేసుకోవద్దు!
చాలామంది ఉద్యోగులు తమ పొదుపు మొత్తాన్ని పీపీఎఫ్ (PPF) లేదా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (FD) దాచుకుంటారు. ఇవి సురక్షితమైన ఆప్షన్సే. కానీ, వీటి ద్వారా వచ్చే ఆదాయం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంటోంది. అయితే మరి పీపీఎఫ్ కంటే ఎక్కువ వడ్డీ ఇస్తూ, బ్యాంకు ఎఫ్డీల కంటే సురక్షితంగా ఉండి, పన్ను మినహాయింపునిచ్చే మార్గం ఏదైనా ఉందా? అంటే కచ్చితంగా ఉంది. అదే వీపీఎఫ్ (VPF) (Voluntary Provident Fund). మీరు ఇప్పటికే ఈపీఎఫ్ (EPF) పరిధిలోకి వచ్చే ఉద్యోగి అయితే.. ఈ ఆప్షన్ మీకు ఒక వరం లాంటిది.

PPF & FD లతో సమస్య ఏమిటి?
ప్రస్తుతం పీపీఎఫ్ (PPF) వడ్డీ రేటు సుమారు 7.1 శాతంగా ఉంది. ఇక బ్యాంకు ఎఫ్డీల విషయానికి వస్తే 6 నుండి 8 శాతం వరకు వడ్డీ ఇస్తున్నప్పటికీ.. అది పూర్తిగా పన్నుకు లోబడి ఉంటుంది. అంటే మీరు 30 శాతం టాక్స్ బ్రాకెట్‌లో ఉంటే మీకు వచ్చే 7 శాతం వడ్డీ అసలు విలువ 5 శాతం కంటే తక్కువకు పడిపోతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మీ సంపద పెరగడం చాలా కష్టమవుతుంది.
అసలు VPF అంటే ఏమిటి?
మీ జీతం నుండి ప్రతి నెలా కట్ అయ్యే 12 శాతం ఈపీఎఫ్ కాకుండా మీ ఇష్టపూర్వకంగా (Voluntarily) అదనంగా కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేయడమే VPF. మీరు మీ బేసిక్ జీతం, డీఏ (DA) లో 100 శాతం వరకు కూడా జమ చేయవచ్చు. దీనిపై కూడా ఈపీఎఫ్ ఇచ్చే 8.25 శాతం వడ్డీయే లభిస్తుంది. ప్రభుత్వ గ్యారెంటీ ఉండటం దీనిలోని అతిపెద్ద ప్లస్ పాయింట్.
8.25% టాక్స్-ఫ్రీ రిటర్న్స్ ఎలా సాధ్యం?
ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. మీ మొత్తం వార్షిక పీఎఫ్ కాంట్రిబ్యూషన్ (EPF + VPF కలిపి) రూ. 2.5 లక్షల లోపు ఉంటే.. దానిపై వచ్చే వడ్డీకి ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అంటే నెలకు సుమారు రూ. 20,000 వరకు అదనంగా పొదుపు చేసుకుంటే మీరు సంపాదించే వడ్డీ పూర్తిగా మీకే దక్కుతుంది. ఒకవేళ మీరు 30 శాతం పన్ను చెల్లించే వ్యక్తి అయితే ఈ 8.25 శాతం టాక్స్-ఫ్రీ రిటర్న్స్ అనేవి సుమారు 12 శాతం బ్యాంకు FD రిటర్న్స్ తో సమానం. ఇంత ఎక్కువ వడ్డీని గ్యారెంటీగా ఇచ్చే మరే ఇతర ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్లో లేదు.
VPF ఎలా ప్రారంభించాలి?
దీనికోసం మీరు ఎలాంటి కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం లేదు. మీ కంపెనీలోని హెచ్‌ఆర్ (HR) లేదా పేరోల్ విభాగానికి వెళ్లి, మీ జీతం నుండి కొంత మొత్తాన్ని VPF రూపంలో కట్ చేయమని కోరితే సరిపోతుంది. ఆ మొత్తం ప్రతి నెలా ఆటోమేటిక్‌గా మీ పీఎఫ్ అకౌంట్ లోకి వెళ్తుంది. ఇది మీ పదవీ విరమణ సమయానికి ఒక భారీ నిధిని (Retirement Corpus) ఏర్పాటు చేయడంలో గొప్పగా తోడ్పడుతుంది.
చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. దీనిలో లిక్విడిటీ (డబ్బు వెంటనే తీసుకునే సౌలభ్యం) FD ల కంటే తక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక పొదుపు కోసం రూపొందించబడింది. కాబట్టి రాబోయే 5 నుండి 10 ఏళ్ల వరకు అవసరం లేని డబ్బును దీనిలో పెట్టుబడిగా పెట్టడం అత్యంత తెలివైన నిర్ణయం.


Click it and Unblock the Notifications