హోంలోన్ వడ్డీ రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు?
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటురంగ బ్యాంకులు HDFC, ICICI, కొటక్ మహీంద్రా సహా వివిధ బ్యాంకులు ఇటీవల హోంలోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. కొన్ని బ్యాంకులు ఈ వడ్డీ రేట్లను పది సంవత్సరాలు, 15 సంవత్సరాల కనిష్టానికి తగ్గించాయి. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ ఏడాదికాలంగా రెపో రేటును తగ్గిస్తోంది. ఇందుకు అనుగుణంగా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. అయితే ఇటీవల ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించకపోయినప్పటికీ బ్యాంకులు మాత్రం దశాబ్దం కనిష్టానికి తగ్గించాయి. ఇందుకు ప్రధాన కారణం ఎన్పీఏలు ఈ విభాగంలో తక్కువగా ఉండటం, ద్రవ్యలభ్యత ఉండటం.

అందుకే హోంలోన్ వడ్డీ రేట్లు తక్కువ
హౌసింగ్ లోన్ సెగ్మెంట్ వాటా రూ.14 లక్షల కోట్లకు పైగా ఉంది. ఈ విభాగంలో వడ్డీ రేట్ల తగ్గింపుతో కస్టమర్లను మరింత ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి బ్యాంకులు. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా బ్యాంకు హోంలోన్ వడ్డీ ఆఫర్ ఇచ్చాయి. ఇదే దారిలో మరిన్ని బ్యాంకులు నడిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధారణ రుణ గిరాకీ ఆశించినస్థాయి కంటే తక్కువగా ఆరు శాతంలోపు ఉండటం, బ్యాంకుల దగ్గర సుమారు రూ.6.5 లక్షల కోట్లకు పైగా ద్రవ్య లభ్యత ఉండటం హోంలోన్ నిరర్థక ఆస్తులు అతి తక్కువగా ఒక శాతం లోపు ఉండటం ఇందుకు కారణాలని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది.

బ్యాంకుల వద్ద నిరుపయోగంగా ఉండటం కంటే
నిధులు పెద్ద ఎత్తున బ్యాంకుల వద్ద నిరుపయోగంగా ఉంటే వాటి నికర లాభంపై ప్రభావం పడుతుంది. డిపాజిటర్లకు ప్రస్తుత కనీస వడ్డీ అయిన 2.5 శాతం చెల్లించేందుకు అయినా, బ్యాంకులు తమ వద్ద అధికంగా నిధులను తక్కువ వడ్డీకి ఐనా రుణంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాయని చెబుతున్నారు. కరోనా కారణంగా హోంలోన్స్ పైన గత ఏడాది ప్రభావం పడింది. దీంతో 2020 జనవరిలో 17.5 శాతంగా ఉన్న హోంలోన్ వృద్ధి ఈ ఏడాది జనవరి నాటికి 7.7 శాతానికి క్షీణించింది.

బ్యాంకులకు అసెట్
హోంలోన్ విభాగంలో నిరర్థక ఆస్తులు ఎస్బీఐకి 0.67 శాతం, హెచ్‌డీఎఫ్‌సీకి 1 శాతం లోపు ఉన్నాయి. అదే సమయంలో ఆర్థిక రికవరీలో భాగంగా హోంలోన్స్ తీసుకోవడం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. అంతేకాదు, హోంలోన్స్ చెల్లించకుంటే ఆస్తులు స్వాధీనం చేసుకునే వెసులుబాటు ఉంది. వాటిని వేలంలో విక్రయించవచ్చు.
వివిధ బ్యాంకుల్లో హోంలోన్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. ఎస్బీఐ 6.7 శాతం, కొటక్ బ్యాంకు 6.65 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ6.75 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 6.7 శాతం ఉన్నాయి. మార్కెట్ వాటా పరంగా ఎస్బీఐ 34 శాతం, హెచ్‌డీఎప్‌సీ 19 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 13 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications