Credit Score: లోన్ కోసం తిరుగుతున్నారా? మీ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఇవి పాటిస్తే చాలు!
చాలామంది మొదటిసారి లోన్ లేదా క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు ఒకటే అనుకుంటారు.. "టైమ్‌కి కట్టేస్తే సరిపోతుంది కదా.. నా క్రెడిట్ స్కోర్ (Credit score) దానంతట అదే పెరుగుతుంది" అని. కానీ నిజానికి ఇది అంత సులభం కాదు. క్రెడిట్ స్కోర్ అనేది కేవలం డబ్బులు కట్టడం మీద మాత్రమే ఆధారపడదు. లోన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలియక, తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలామంది తమ క్రెడిట్ ప్రొఫైల్‌ను పాడుచేసుకుంటున్నారు. ఒక్కసారి స్కోర్ పడిపోతే, దానిని మళ్ళీ పెంచుకోవడానికి నెలలు, ఏళ్లు పడుతుంది.

అసలు స్కోర్ ఎందుకు పడిపోతుంది?
కొత్తగా క్రెడిట్ కార్డు వాడేవారికి కొన్ని విషయాల మీద అవగాహన ఉండదు. రిపేమెంట్ హిస్టరీ, క్రెడిట్ యుటిలైజేషన్ (కార్డు వాడకం శాతం), ఎన్ని లోన్లు ఉన్నాయి అనేవన్నీ స్కోర్‌ను ప్రభావితం చేస్తాయి. కేవలం అప్పు దొరికితే చాలు అనుకుంటారే తప్ప, దానిని ఎలా మేనేజ్ చేయాలో పట్టించుకోరు.
ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- వాయిదాల చెల్లింపులో జాప్యం: ఒక్క EMI లేదా క్రెడిట్ కార్డు బిల్లు మిస్ అయినా మీ స్కోర్‌పై భారీ ప్రభావం పడుతుంది. ఆటో-డెబిట్ ఆప్షన్ ఉన్నా కూడా, అకౌంట్లో బ్యాలెన్స్ లేక పేమెంట్ ఫెయిల్ అయితే అది 'డిఫాల్ట్' కింద లెక్కించబడుతుంది.
- లిమిట్ మొత్తం వాడేయడం: క్రెడిట్ కార్డు ఉందంటే అది ఎక్స్‌ట్రా ఖర్చు కోసం కాదు. మీ కార్డు లిమిట్‌లో 30-40% కంటే ఎక్కువ వాడితే, మీరు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని బ్యాంకులు భావిస్తాయి. ఇది మీ క్రెడిట్ స్కోర్ (Credit score) ను తగ్గిస్తుంది.
- ఎక్కువ సార్లు లోన్ కోసం అప్లై చేయడం: మీరు ప్రతి నెలా కొత్త లోన్ లేదా కార్డు కోసం అప్లై చేస్తుంటే, మీ రిపోర్టులో ప్రతిసారీ 'హార్డ్ ఎంక్వైరీ' జరుగుతుంది. ఎక్కువ ఎంక్వైరీలు ఉంటే, మీకు డబ్బుల అవసరం చాలా ఎక్కువగా ఉందని బ్యాంకులు నెగటివ్‌గా భావిస్తాయి.
- రిపోర్టును చెక్ చేయకపోవడం: మీ క్రెడిట్ రిపోర్టులో తప్పులు ఉండవచ్చు, లేదా మీ పేరు మీద ఎవరైనా ఫ్రాడ్ లోన్లు తీసుకోవచ్చు. మీరు రెగ్యులర్‌గా చెక్ చేయకపోతే, లోన్ రిజెక్ట్ అయినప్పుడు కానీ మీకు అసలు విషయం తెలియదు.
తప్పుడు అప్పుతో మొదలు పెట్టకండి
చాలామంది ఈజీగా దొరుకుతున్నాయి కదా అని పర్సనల్ లోన్లు లేదా 'బై నౌ పే లేటర్' ఆప్షన్లు వాడుతుంటారు. వీటిలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటమే కాకుండా, రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. చిన్న లోన్ లేదా బేసిక్ క్రెడిట్ కార్డుతో మొదలుపెట్టి, డిసిప్లిన్‌గా కట్టడం వల్ల స్కోర్ వేగంగా పెరుగుతుంది.
స్కోర్ పెంచుకోవడం ఎలా?
మంచి క్రెడిట్ స్కోర్ సంపాదించడానికి పెద్ద పెద్ద యుద్ధాలు చేయక్కర్లేదు. కేవలం ఈ మూడు సూత్రాలు పాటిస్తే చాలు..
- బిల్లులు ఎప్పుడూ నిర్ణీత తేదీ కంటే ముందే కట్టండి.
- మీ కార్డు లిమిట్‌లో తక్కువ శాతం మాత్రమే ఖర్చు చేయండి.
- అవసరం లేకుండా పదే పదే లోన్ల కోసం అప్లై చేయకండి.
గుర్తుంచుకోండి, క్రెడిట్ స్కోర్ అనేది రాత్రికి రాత్రే పెరిగేది కాదు. మీరు క్రమం తప్పకుండా పాటించే క్రమశిక్షణే మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది.


Click it and Unblock the Notifications