HDFC Bank: రుణగ్రహీతలకు గుడ్ న్యూస్ చెప్పిన హెచ్డిఎఫ్సీ బ్యాంక్.. వడ్డీ రేట్లు తగ్గింపు..!
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. బుధవారం నాడు రెపో రేటును 5.25% నుండి 5.5%కి పెంచింది. దీంతో లోన్లు తీసుకున్నవారిపై భారం పడే అవకాశం ఉంది. బ్యాంకులు లోన్లపై వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే విచిత్రంగా ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ హెచ్డిఎఫ్సీ కీలక నిర్ణయం తీసుకుంది. HDFC బ్యాంక్ తన MCLR (Marginal Cost of Funds-Based Lending Rate) ఆధారిత గృహ రుణాలపై అన్ని కాలపరిమితులకు (tenures) వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్ల (bps) వరకు తగ్గించింది.
దీనివల్ల సంబంధిత రుణగ్రహీతల నెలవారీ వాయిదాలు (EMIs) తగ్గనున్నాయి. ఒక బేసిస్ పాయింట్ అనేది ఒక శాతం పాయింట్‌లో వందో వంతుకు సమానం. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం సవరించిన MCLR రేట్లు అక్టోబర్ 7, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ సవరణ తర్వాత రుణ కాలపరిమితిని బట్టి హెచ్డిఎఫ్సీ బ్యాంక్ MCLR రేట్లు 7.80 శాతం నుంచి 8.55 శాతం మధ్య ఉంటాయి. గతంలో రుణ కాలపరిమితిని బట్టి హెచ్డిఎఫ్సీ బ్యాంక్ MCLR రేట్లు 7.90 శాతం నుంచి 8.60 శాతం మధ్య ఉండేవి. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ 'ఓవర్‌నైట్' (ఒక రోజు కాలపరిమితి) MCLR సెప్టెంబర్ 2026లో ఉన్న 7.90 శాతం నుంచి అక్టోబర్ 2026 నాటికి 7.80 శాతానికి తగ్గింది (10 బేసిస్ పాయింట్ల తగ్గింపు).

ఒక నెల కాలపరిమితి గల MCLR రేటు 7.90% నుంచి 7.75%కి (15 బేసిస్ పాయింట్లు) తగ్గింది. మూడు నెలల MCLR రేటు 8.05% నుంచి 7.95 శాతాకి (10 బేసిస్ పాయింట్లు) తగ్గింది.
హెచ్డిఎఫ్సీ బ్యాంక్ 6 నెలల MCLR రేటు 8.25% నుంచి 8.15%కి తగ్గగా, ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ రేటు 8.35% నుంచి 8.30%కి (5 బేసిస్ పాయింట్లు) తగ్గింది. 2-ఏళ్ల MCLR 8.45% నుంచి 8.40%కి తగ్గింది. అలాగే 3-ఏళ్ల MCLR కూడా సెప్టెంబర్‌లో ఉన్న 8.60% నుంచి అక్టోబర్ 2026 నాటికి 8.55%కి (5 బేసిస్ పాయింట్లు) తగ్గింది.
ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణంపై ఆర్థిక సంస్థ వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణంపై వడ్డీ రేటు కనిష్ట పరిమితిని నిర్దేశిస్తుంది. ఆర్బీఐ ప్రత్యేకంగా వేరే విధంగా సూచించకపోతే, రుణగ్రహీతలకు ఈ రేటు పరిమితి స్థిరంగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో MCLR విధానాన్ని ప్రవేశపెట్టింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
