Minimum Due: క్రెడిట్ కార్డు బిల్లులో 'మినిమం డ్యూ' కడితే లాభమా? నష్టమా? బ్యాంకులు చెప్పని సీక్రెట్ ఇదే!
క్రెడిట్ కార్డ్ అనేది అవసరానికి ఆదుకునే అద్భుతమైన ఫైనాన్షియల్ టూల్. కానీ, దానిని సరిగ్గా వాడకపోతే మాత్రం అది మిమ్మల్ని కోలుకోలేని అప్పుల్లోకి నెట్టేస్తుంది. చాలా మంది చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే.. నెల చివరలో బిల్లు రాగానే, అందులో తక్కువగా కనిపించే కనీస బకాయి (Minimum Due)ని చెల్లించి చేతులు దులుపుకోవడం. ఇది చూడటానికి హాయిగా అనిపించినా, లాంగ్ రన్‌లో ఇది మిమ్మల్ని ఒక డేంజరస్ అప్పుల ట్రాప్‌లోకి నెట్టేస్తుంది.

టోటల్ డ్యూ vs మినిమం డ్యూ: తేడా ఏంటి?
మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో రెండు రకాల బకాయిలు కనిపిస్తాయి.
- Total Amount Due (మొత్తం బకాయి): మీరు ఆ నెలలో కార్డ్ ఉపయోగించి ఖర్చు చేసిన మొత్తం డబ్బు ఇది. దీనిని పూర్తిగా చెల్లిస్తే మీకు ఎలాంటి వడ్డీ పడదు, మీ అప్పు పూర్తిగా క్లియర్ అవుతుంది.
- Minimum Amount Due (కనీస బకాయి): ఇది సాధారణంగా మీ మొత్తం బిల్లులో కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది. దీనిని చెల్లిస్తే ప్రస్తుతానికి మీ అకౌంట్ యాక్టివ్‌గా ఉంటుంది , లేట్ పేమెంట్ ఛార్జీలు పడవు.
మినిమం డ్యూ కడితే ఏమవుతుంది?
చాలా మంది "అమ్మయ్య.. తక్కువ కట్టాం కదా" అని రిలాక్స్ అవుతారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మీరు మినిమ్ డ్యూ (Minimum Due) మాత్రమే చెల్లిస్తే, మిగిలిన 95% బకాయిపై మరుసటి రోజు నుండే వడ్డీ పడటం మొదలవుతుంది. క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు ఏడాదికి 30% నుండి 45% వరకు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఉదాహరణకు.. మీ బిల్లు రూ. 10,000 అనుకుందాం. మీరు కేవలం రూ. 500 మినిమం డ్యూ కడితే, మిగిలిన రూ. 9,500 పై భారీ వడ్డీ పడుతుంది. మరుసటి నెలలో మీరు చేసే ఖర్చులు, ఈ పాత అప్పు, దాని మీద వడ్డీ.. ఇవన్నీ కలిసి కొండలా పెరుగుతాయి. మీరు కట్టే చిన్న మొత్తం కేవలం వడ్డీకే సరిపోతుంది తప్ప, మీ అసలు అప్పు మాత్రం అలాగే ఉంటుంది.
ఇది ఒక వల (Debt Trap)!
బ్యాంకులు ఈ ఆప్షన్‌ను ఇవ్వడానికి కారణం.. మీకు అత్యవసర సమయంలో వెసులుబాటు కల్పించడం కోసం మాత్రమే. ఏదైనా ఒక నెల అస్సలు డబ్బులు లేనప్పుడు మాత్రమే దీనిని వాడాలి. కానీ దీనిని ఒక అలవాటుగా మార్చుకుంటే మాత్రం, మీరు వడ్డీ మీద వడ్డీ కడుతూనే ఉంటారు తప్ప అప్పు నుంచి బయటపడలేరు. మీరు తీసుకున్న అసలు మొత్తం కంటే రెట్టింపు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.
అప్పుల నుండి బయటపడటం ఎలా?
- పూర్తిగా చెల్లించండి: వీలైనంత వరకు ఎప్పుడూ 'Total Due' మాత్రమే కట్టండి.
- ఎక్కువగా కట్టండి: ఒకవేళ మొత్తం కట్టలేకపోతే, కేవలం మినిమమ్ డ్యూ (Minimum Due) కాకుండా మీ దగ్గర ఉన్నంతలో ఎక్కువ మొత్తాన్ని (ఉదాహరణకు 50% లేదా 60%) చెల్లించండి. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది.
- ఖర్చులు తగ్గించండి: అప్పు ఉన్నప్పుడు ఆ కార్డ్ మీద కొత్త ఖర్చులు చేయడం ఆపండి.
గుర్తుంచుకోండి.. ఈ రోజు మీరు చేసే చిన్న పొదుపు, రేపు మిమ్మల్ని పెద్ద ఆర్థిక నష్టం నుండి కాపాడుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లును సీరియస్‌గా తీసుకోండి, వడ్డీ ఊబిలో చిక్కుకోకండి!


Click it and Unblock the Notifications