Vehicle Insurance: కొత్త కారుకు బీమా కింద తప్పక ఉండాల్సిన Add-On ఇవే..!
మీరు కొత్త కారు కొంటున్నారా..? అయితే దానికి తప్పకుండా బీమా చేయించాల్సిందే. అయితే ఇన్ష్యూరెన్స్ చేయించే ముందు కొన్ని కీలక విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇన్ష్యూరెన్స్ సంస్థ వాడు ఏది చెబితే దానికి ఓకే అని చెప్పి డబ్బులు పెట్టి బీమాను కొనుగోలు చేశామంటే ఆ తర్వాత బాధపడాల్సి ఉంటుంది. అందుకే వెహికల్ ఇన్ష్యూరెన్స్ తీసుకునే ముందు ఈ కింది అంశాలు లేదా యాడాన్స్ కవర్ అవుతున్నాయో లేదో చూసి ఆ తర్వాత ఇన్ష్యూరెన్స్‌కు వెళ్లండి.
జీరో డిప్రిసియేషన్: జీరో డిప్రిసియేషన్‌ను నిల్ డిప్రిసియేషన్ లేదా బంపర్ టూ బంప్ కవరేజ్ అని కూడా అంటారు. కారు కొన్న తర్వాత ప్రతి ఏటా కారు తాలూకా డిప్రిసియేషన్ వాల్యూ 5 నుంచి 6శాతంకు తగ్గుతూ వస్తుంది. ఉదాహరణకు ఆరేళ్ల తర్వాత కారుకు ఏదైనా ప్రమాదం జరిగి లేదా డ్యామేజ్ అయితే మీరు ఇన్ష్యూరెన్స్ కవరేజీకి అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అయితే డ్యామేజీ డబ్బులు మొత్తం రావు. కారు డిప్రిసియేషన్ తీసేశాక వచ్చే డబ్బులు మాత్రమే మీకు కవరేజ్ కింద వస్తాయి.అలా జరగకుండా ఉండాలంటే జీరో డిప్రిసియేషన్ కవరేజ్ తప్పకుండా తీసుకోవాలి.

రోడ్ సైడ్ అసిస్టెన్స్ (RSA): మీరు కొన్న కారుకు ఇన్ష్యూరెన్స్ ఉండి అది ఎక్కడైనా బ్రేక్ డౌన్ అవడం లేదా ఎక్కడైనా చెడిపోయి నిలిచిపోతే పాలసీదారుడికి ఆ ఇన్ష్యూరెన్స్ సంస్థ సహాయం చేస్తుంది. కారును టోయింగ్ చేయడం అంటే రిపేర్ సెంటర్ వరకు కారును ఆ ఇన్ష్యూరెన్స్ సంస్థ టోయింగ్ వెహికల్ ద్వారా తరలిస్తుంది.మీ వాహనం మార్గమధ్యలో ఎక్కడైనా ఆగిపోతే మీరు తీసుకున్న ఇన్ష్యూరెన్స్ పాలసీలో రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవరేజ్ ఉంటే మంచిది.ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా మారుతుంది.
ఇంజిన్ ప్రొటెక్షన్: ఇంజిన్ ప్రొటెక్షన్.. ఈ పేరులోనే ఉంది ఇంజిన్‌కు ఏమైనా డ్యామేజ్ జరిగితే మొత్తాన్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ యాడ్ ఆన్ తప్పకుండా మీ ఇన్ష్యూరెన్స్‌లో కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే కారుకు గుండె లాంటిది ఇంజిన్. అసలు ఆ గుండె పాడైపోతే కారు లేదా వాహనం పనికిరాకుండా పోతుంది. కొత్త ఇంజిన్ కొనాలంటే బోలెడు ఖర్చు అవుతుంది. అందుకే ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ చేసుకుంటే ఎలాంటి చింత ఉండదు.
ఇన్ వాయిస్ ప్రైసింగ్: ఇన్ వాయిస్ ప్రైసింగ్ కూడా మీ ఇన్ష్యూరెన్స్ యాడాన్స్‌లో భాగంగా కచ్చితంగా ఉండాల్సిన అంశం. ఎందుకంటే ఎప్పుడైనా కారుకు ప్రమాదం జరిగినా లేదా కారు దొంగలించబడ్డా.. పాలసీదారుడు ఈ ఇన్‌వాయిస్ ప్రైసింగ్ అనేది ఇన్ష్యూరెన్స్‌లో యాడ్ ఆన్ చేయించుకుని ఉంటే అతనికి కారు యొక్క అసలు ధరను బీమా సంస్థ చెల్లిస్తుంది. అయితే ఇన్ష్యూరెన్స్ తీసుకునేముందు ఈ ఇన్ వాయిస్ ప్రైసింగ్ యాడ్‌ఆన్‌గా తీసుకుంటే కాస్త ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
కాబట్టి కారు కొనుగోలు చేశాక ఇన్ష్యూరెన్స్ తీసుకునే సమయంలో పైన నాలుగు యాడాన్స్ కచ్చితంగా తీసుకుంటే సరైన సమయంలో ఉపయోగపడుతాయి అదే సమయంలో మనపై ఆర్థిక భారం లేకుండా చేస్తాయి.


Click it and Unblock the Notifications