దీపావళి వరకు UPI ఛార్జీలకు బ్రేక్.. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్న NPCI..
UPI MDR Update 2026: రాబోయే ధంతేరస్, దీపావళి పండుగల సీజన్‌ను పురస్కరించుకుని డిజిటల్ చెల్లింపులు స్వీకరించే చిన్న, చిన్న-మధ్యతరహా వ్యాపారులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భారీ ఊరటనిచ్చింది. ఎంపిక చేసిన వ్యాపార (Merchant) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) రుసుమును విధిస్తూ అక్టోబర్ 15వ తేదీ నుంచి అమలు చేయాల్సిన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది.
పండుగ షాపింగ్ ఊపందుకుంటున్న తరుణంలో వ్యాపారులు, వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో యూపీఐ, సర్వీస్ స్టీరింగ్ కమిటీతో చర్చించిన అనంతరం ఈ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. దీపావళి పండుగ ముగిసిన తర్వాత ఈ కొత్త రుసుముల అమలుకు సంబంధించిన నూతన తేదీని విడిగా ప్రకటిస్తామని వెల్లడించింది.

నూతన నిబంధనల ప్రకారం.. వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను ప్రాసెస్ చేసే బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలకు చెల్లించే ఈ ఎండీఆర్ రుసుము నిర్మాణంలో ఎలాంటి మార్పులు ఉండవు. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన ఎంపిక చేసిన యూపీఐ వ్యాపార లావాదేవీలపై 0.40 శాతం రుసుము (గరిష్టంగా రూ. 300 పరిమితితో) వసూలు చేయబడుతుంది. అలాగే ఇంధనం, విద్యుత్ బిల్లులు, విద్యాసంస్థల చెల్లింపులు వంటి కొన్ని ప్రత్యేక వర్గాల లావాదేవీలపై రూ. 5 స్థిర రుసుము అమలవుతుంది.
ఈ చార్జీల విధింపును జనవరి 1వ తేదీ వరకు వాయిదా వేయాలని వ్యాపార వర్గాలు కోరినప్పటికీ.. దీపావళి ముగిసిన వెంటనే అమలులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రుసుములపై నిరసనగా చిల్లర వ్యాపారుల సంఘాలు అక్టోబర్ 2న 'యూపీఐ వ్యతిరేక దినం' నిర్వహించాలని భావించినా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన సమగ్ర చర్చల అనంతరం ఆ పిలుపును విరమించుకున్నాయి.
మరోవైపు దేశంలో యూపీఐ డిజిటల్ లావాదేవీలు రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తూ దూసుకుపోతున్నాయి. గడిచిన సెప్టెంబర్ నెలలో యూపీఐ ద్వారా రోజుకు సగటున 802 మిలియన్ల (80.2 కోట్లు) లావాదేవీలు జరగగా, రోజువారీ సగటు లావాదేవీల విలువ రూ. 97,913 కోట్లకు చేరి ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది. గతేడాది సెప్టెంబర్‌లోని 1,963 కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఈసారి 22.6 శాతం పెరిగి మొత్తం లావాదేవీల సంఖ్య 2,407 కోట్లకు చేరుకుంది.
అలాగే మొత్తం లావాదేవీల విలువ సైతం 18 శాతం వృద్ధితో రూ. 24.89 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ. 29.37 లక్షల కోట్లకు పెరిగింది. ఆగస్టు నెలతో (2,451 కోట్ల లావాదేవీలు, రూ. 29.82 లక్షల కోట్లు) పోలిస్తే సెప్టెంబర్‌లో రోజుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల నెలవారీగా 1.8 శాతం స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ, సగటు రోజువారీ రికార్డు పరిమాణం భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ బలమైన వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications
