లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకమైన పెన్షన్ స్కీంను అందిస్తోంది. దీని పేరు వయ వందన యోజన. LIC PMVVY స్కీం మార్చి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఆపై ఈ స్కీంను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తే మళ్లీ అందుబాటులోకి రావొచ్చు. అరవై ఏళ్లకు పైన వయసు గల వారు ఈ ఎల్ఐసీ పథకంలో చేరవచ్చు.

సంవత్సరానికి 8.3 శాతం రాబడి
ఎల్ఐసీ వయ వందన యోజన స్కీంలో చేరడం వల్ల సంవత్సరానికి ఎనిమిది శాతం నుంచి 8.3 శాతం వరకు రాబడి పొందవచ్చు. వడ్డీ మొత్తం మీరు ఎంచుకునే పేమెంట్ ఆప్షన్ ప్రాతిపదికన మారుతుంది. అందువల్ల స్కీంలో చేరేటప్పుడు పేమెంట్ ఆప్షన్ గురించి ఆలోచించాలి.

స్కీంలో చేరితే నాలుగు ఆప్షన్స్
వయ వందన యోజన స్కీంలో చేరితే పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. నెలనెలా డబ్బులు తీసుకోవచ్చు లేదా మూడు నెలలకు ఓసారి తీసుకోవచ్చు లేదా ఆరు నెలలకు ఓసారి తీసుకోవచ్చు లేదా ఏడాదికి ఓసారి పెన్షన్ డబ్బులు పొందే ఛాన్స్ ఉంది.

లక్షన్నర ఇన్వెస్ట్ చేస్తే రూ.1,000 పెన్షన్
ఎల్ఐసీ వయ వందన యోజన స్కీం ద్వారా కనీసం పెన్షన్ పొందాలంటే ముందుగా రూ.1.5 లక్షల పథకంలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ మొత్తంపై ప్రతి నెల రూ.1,000 వరకు పెన్షన్ తీసుకోవచ్చు. డిపాజిట్ మొత్తం పెంచుకుంటే ప్రతి నెల తీసుకునే పెన్షన్ పెరుగుతుంది.

రూ.10,000 వరకు పెన్షన్
ప్రధానమంత్రి వయ వందన యోజన స్కీంలో చేరితే నెలకు గరిష్టంగా రూ.10,000 వరకు పెన్షన్ తీసుకోవచ్చు. దీని కోసం స్కీంలో చేరే సమయంలో రూ.15 లక్షలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. దీనికి మెచ్యూరిటీ కాలం పదేళ్లు. మీ డబ్బును పదేళ్ల పాటు డిపాజిట్ చేయాలి.

రుణం తీసుకోవచ్చు
ఈ స్కీం కింద లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. మూడేళ్ల తర్వాత నుంచి ఈ లోన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులో 75 శాతం వరకు మొత్తాన్ని రుణం కింద తీసుకోవచ్చు. నెఫ్ట్ లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టం ద్వారా పెన్షన్ చెల్లిస్తారు.

ఆధార్ తప్పనిసరి.. డిపాజిట్ నామినీకి
వయ వందన యోజన స్కీంకు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ స్కీంలో చేరేవారికి ఆధార్ ధృవీకరణ తప్పనిసరి. కేంద్రం తరఫున ఎల్ఐసీ ఈ స్కీంను అమలు చేస్తోంది. ఈ స్కీంలో చేరిన వారు మరణిస్తే డిపాజిట్ చేసిన మొత్తాన్ని నామినీకి ఇస్తారు.

పెన్షన్ పైన పన్ను
వయ వందన స్కీంలో చేరిన తర్వాత పెన్షన్ మొత్తంపై పన్ను ఉంటుంది. ఈ ఇన్‌కం ట్యాక్స్ స్లాబ్ ప్రాతిపదికన పన్ను ఉంటుంది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు.


Click it and Unblock the Notifications