గ్యాస్ ధర నుండి హోంలోన్ ఆఫర్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఆధార్ లింక్ వరకు.. రేపటి నుండి మార్పులివే
ప్రతి నెల కొన్ని నిబంధనలు లేదా ధరలు మారి కొత్తవి అమలులోకి వస్తుంటాయి. ఇవి సామాన్యులపై ప్రభావం చూపుతాయి. రేపటి నుండి డిసెంబర్ 1వ తేదీ ప్రారంభమవుతుంది. రేపటి నుండి కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చే నెల నుండి గ్యాస్ సిలిండర్ ధరలు మారే అవకాశముంది. యూఏఎన్-ఆధార్ లింకింగ్‌కు చివరి తేదీ నేడే. చాలా బ్యాంకులు పండుగ సమయంలో ఇచ్చిన హోమ్ లోన్ ఆఫర్స్ ఈ నెలతో కొన్ని, వచ్చే నెలతో కొన్ని పూర్తి కానున్నాయి. అలాగే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే కాస్త భారం కానుంది.

గ్యాస్ సిలిండర్ ధరలు
దేశీయ చమురురంగ కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి నెల మొదట్లో ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గాయి. అయితే గతకొద్ది రోజుల ధరలను పరిగణలోకి తీసుకొని కంపెనీలు ధరలను ఫిక్స్ చేస్తాయి. దీని ఆధారంగా ధరలు తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. అంతేకాదు, ధరలను స్థిరంగా కూడా అట్టిపెట్టవచ్చు.

హోమ్ లోన్ ఆఫర్స్
దసరా, దీపావళి పండుగ సమయంలో చాలా బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇచ్చాయి. వడ్డీ రేటు తగ్గింపు, ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు లేదా మినహాయింపు వంటి ప్రయోజనాలు అందించాయి. ఇప్పటికే పలు బ్యాంకుల ఆఫర్లు క్లోజ్ అయ్యాయి. మరిన్ని బ్యాంకుల ఆఫర్లు డిసెంబర్ 31కి పూర్తవుతాయి. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్ ఆఫర్ 30 నవంబర్‌తో పూర్తవుతోంది.

ఎస్బీఐ క్రెడిట్ కార్డు
డిసెంబర్ 1వ తేదీ నుండి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ షాపింగ్ ఈఎంఐ కాస్త భారం కానుంది. ఇప్పటి వరకు ఎస్బీఐ కార్డు పైన వడ్డీ రేటు మాత్రమే ఉంటోంది. ఇక నుండి ప్రాసెసింగ్ ఫీజును కూడా ఛార్జ్ చేస్తారు.

యూఏఎన్-ఆధార్ లింక్
ఆధార్-యూఏఎన్ లింకింగ్‌ను 30 నవంబర్ వరకు పూర్తి చేయాలి. డిసెంబర్ 1వ తేదీ నుండి ఈసీఆర్(ఎలక్ట్రానిక్ చలన్ కమ్ రిటర్న్స్) ఫైలింగ్‌ను కోరుతారు. ఉద్యోగి యూఏఎన్-ఆధార్‌తో వెరిఫై కాకుండా ఈసీఆర్ ఫైల్ చేయలేరు. అప్పుడు పీఎఫ్ నిలిపివేసే ఆస్కారం ఉంటుంది.


Click it and Unblock the Notifications