SCSS: వృద్ధాప్యంలో భరోసా.. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. మూడు నెలకు రూ.41,000 మీ సొంతం..
చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. తమ జీవిత కాలం పిల్లల చదువు కోసం, వారి పెళ్లిళ్ల కోసం కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే వృద్ధాప్యంలో ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతుంటారు. కొంత సరైన ప్రణాళిక లేక జీవిత చరమంకంలో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలాంటి వారి కోసం పోస్టాఫీస్ లో ఒక స్కీమ్ ఉంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం. ఇది చాలా సురక్షితమైన పథకంగా చెబుతారు. వృద్దాప్యంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయం పొందాలనుకునేవారికి ఈ పథకం చక్కని ఎంపికని నిపుణులు చెబుతున్నారు. ఈ పథకంలో ఒక్కోసారి బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ వస్తుందని చెబుతున్నారు.
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీని చెలిస్తున్నారు. ఇందులో పెట్టుబడి చాలా సురక్షితం. పైగా కచ్చితమైన రాబడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే రిస్క్ ఉంటుంది. కానీ ఈ పథకంలో పెట్టుబడి పెడితే గ్యారెంటీ రాబడి ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఖాతా కనీసం రూ.1000 లతో ఓపెన్ చేయవచ్చు. ఇందులో గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో 60 ఏళ్ల పైన ఉన్నవారు మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. 55 ఏళ్లు దాటిన వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. అలాగే రక్షణ శాఖలో పని చేసి రిటైర్డ్ అయిన వారు 50 ఏళ్లు దాటితే ఈ ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.

ఇందులో పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సెక్షన్ 80సీ కింద సంవత్సరానికి రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉండనుంది. పథకంలో త్రైమాసికానికి వడ్డీ చెల్లిస్తారు. మీరు పెట్టుబడి పెట్టిన సొమ్మును బట్టి రాబడి ఉంటుంది. మీరు ఈ పథకంలో రూ.20 లక్షలు చెల్లిస్తే. మీకు 8.2 శాతం వడ్డీతో ప్రతి మూడు నెలలకు రూ. 40,999 వస్తుంది. ఈ లెక్కన మీకు నెలకు రూ.13,666 వస్తుంది. ఇలా ఐదేళ్ల పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.40,999 వస్తాయి. ఐదేళ్ల మీకు రూ.8,20,000 వడ్డీ పొందుతారు.
ఐదేళ్ల తర్వాత మీరు చెల్లించిన మొత్తం తిరిగి మీ ఖాతాలో జమ అవుతుంది. దీన్ని అవసరమైతే మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ సొమ్ము వచ్చిన వారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకంలో చేరవచ్చు. వీరికి కచ్చితమైన, సురక్షితమైన ఆదాయం వస్తుంది. ఏమైనా జరిగి ఖాతాదారుడు మరణిస్తే మొత్తం డబ్బు నామినీకి చెల్లిస్తారు.


Click it and Unblock the Notifications