RBI: లోన్లు తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇక నుంచి అధిక వడ్డీ భారం ఉండదు..!
జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరు అప్పు చేసి ఉంటారు. అయితే ఇప్పుడు అప్పు చేయడం కంటే బ్యాంకు లోన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు బ్యాంకు లోన్ తీసుకునేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇల్లు, కారు, వాహనం, పర్సనల్ లోన్ తీసుకునేవారికి శుభవార్త అందించింది. దేశంలోని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తమ ఇష్టానుసారం లోన్ నిబంధనలు, ముఖ్యంగా వడ్డీ రేట్లకు ఆధారమైన బెంచ్ మార్క్ లను మార్చకుండా ఉండేందుకు కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. రుణాల వడ్డీ రేట్లలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ ప్రతిపాదనలు చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే లోన్ తీసుకునేవారికి, తీసుకున్నవారికి కాస్త ఊరట లభించే అవకాశం ఉంది.
గతంలో చాలా బ్యాంకులు రుణ గ్రహీతకు సమాచారం ఇవ్వకుండానే బెంచ్ మార్క్ విధానాలను మార్చేశాయి. అయితే ఆర్బీఐ ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం ఇకపై ఏ బ్యాంకు కూడా లోన్ తీసుకున్న వ్యక్తి అనుమతి లేకుండా బెంచ్ మార్క్‌ను మార్చడానికి వీల్లేదని తెలుస్తోంది. ఒకవేళ బ్యాంకులు మార్చాల్సి వస్తే.. ఆ మార్పు వల్ల కస్టమర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదని ఆర్భీఐ నిబంధనల్లో పేర్కొంది. ముఖ్యంగా ఈ మార్పు ప్రక్రియ కోసం బ్యాంకులు కస్టమర్ల నుంచి ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ ఇండియా తేల్చి చెప్పింది. మరో విషయం ఏమిటంటే.. ఫ్లోటింగ్ వడ్డీ రేట్ తో రుణాలు తీసుకున్న వారికి ఈ రూల్స్ వల్ల భారీ ఉపశమనం లభించనుంది.

ఒక బెంచ్ మార్క్ నుంచి మరొక దానికి లోన్ మారినప్పుడు.. పాత వడ్డీ రేటు కంటే కొత్త వడ్డీ రేటు ఎక్కువగా ఉండకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే కేవలం బ్యాంక్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల కస్టమర్లు చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐ లేదా వడ్డీ భారం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఒకవేళ లోన్ అగ్రిమెంట్‌లో ఉన్న పాత బెంచ్ మార్క్ రద్దైతే, కస్టమర్‌కు ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా వేరొక బెంచ్ మార్క్‌కు సురక్షితంగా మార్చాలని ఆర్బీఐ పేర్కొంది. ప్రత్యామ్నాయ బెంచ్‌మార్క్ గురించి అగ్రిమెంట్‌లో ముందే పేర్కొనాలని తెలిపింది.
లోన్ వేరొక సంస్థకు బదిలీ అయినప్పుడు.. అధికారికంగా బ్యాంక్ పేరు మారనంత వరకు పాత వడ్డీ రేట్లు, నిబంధనలే వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. రుణం తీసుకున్న కస్టమర్ కొత్త అగ్రిమెంట్‌పై సంతకం చేస్తేనే కొత్త సంస్థ రూల్స్ వర్తిస్తాయని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పాత లోన్లన్నింటినీ ఏప్రిల్ 1, 2029 నాటికి ఒకేసారి ఈ కొత్త విధానంలోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications