HDFC Life: హెచ్డీఎఫ్సీ లైఫ్‌కు షాక్.. రూ.50 లక్షలు చెల్లించాలని ఆదేశం..!
ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా వరకు క్లయిమ్స్ రిజక్ట్ చేయాలని చూస్తాయి. వారికి క్లయిమ్స్ రిజక్ట్ అయితేనా లాభమని నిపుణులు చెబుతున్నారు. ఇలానే హెచ్డీఎఫ్సీ లైఫ్ ఓ క్లయిమ్ ను తిరస్కరించింది. అయితే వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ దీనిపై విచారణ చేపట్టింది. భర్త మరణం తర్వాత ఆయన భార్య క్లయిమ్ కు దరఖాస్తు చేసింది. అయితే రూ.50 లక్షల క్లయిమ్ ను రిజక్ట్ చేయడాన్ని కమిషన్ ప్రశ్నించింది. వెంటనే రూ.50 లక్షలు చెల్లించాలని, అంతేకుండా.. ఫిర్యాదుదారు మానసిక వేదనకు రూ.50 వేల పరిహారం, న్యాయ ఖర్చుల కోసం మరో రూ. 10 వేలు ఇవ్వాలని ఆదేశించింది.
కర్నూలు జిల్లాకు చెందిన వైద్యుడు శ్రావణ్ కుమార్ 2022లో అక్టోబర్ 15న హెచ్డీఎఫ్సీ లైఫ్ లో పాలసీ తీసుకున్నారు. క్లిక్ 2 ప్రొటెక్ట్ సూపర్ పాలసీ కొనుగోలు చేశారు. శ్రావణ్ కుమార్ ఈ పాలసీ కింద ఏడాదికి రూ.11,478 చెల్లిస్తూ వచ్చారు. ఇందుకు గానూ రూ.50 లక్షల కవరేజ్ పొందారు. ఈ క్రమంలోనే 2024 ఫిబ్రవరి 16న గుండె పోటుతో చనిపోయారు. దీంతో తన భర్త పేరుపై పాలసీ ఉందని తెలుసుకుని.. నామినీ తన పేరు ఉందని గుర్తించిన ఆయన భార్య.. ఇన్సూరెనస్ డబ్బుల కోసం క్లయిమ్ చేశారు. అయితే ఈ క్లయిమ్ ను హెచ్డీఎఫ్సీ లైఫ్ రిజెక్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన కారణాలను కూడా కంపెనీ పేర్కొంది.

శ్రావణ్ కుమార్ పాలసీ తీసుకునే సమయంలో ఆయనకు అప్పటికే మరో రెండు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయని, తమ పాలసీ కొనుగోలు చేసేటప్పుడు ఈ పాలసీ వివరాలు నమోదు చేయలేదని పేర్కొంది. శ్రావణ్ కుమార్ కు కోటక్ లైఫ్ లో ఒకటి, భారతి ఏఎక్స్ఏ లో మరొకటి ఉందని.. అందుకే ఈ క్లయిమ్ ను తిరస్కరించినట్లు స్పష్టం చేసింది. ఆయనకు అప్పటికే పాలసీలు ఉన్నాయని తెలుస్తే పాలసీ ఇచ్చేవాళ్లం కాదని పేర్కొంది. అయితే దీనిపై శ్రావణ్ కుమార్ భార్య సింధుజ కర్నూల్ జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన ఫోరం.. పాలసీ దరఖాస్తు ఫారమ్ ను పరిశీలించింది. అందులో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఉన్న పాలసీలు ఉంటేనే చెప్పాలని.. ఇతర కంపెనీల పాలసీ వివరాలు సమర్పించాలని ఎక్కడా లేదని గుర్తించింది. ఫారమ్ రూపొందించిన కంపెనీ మాత్రమే దీనికి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. బీమా చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం క్లయిమ్ తిరస్కరించాలంటే.. ఉద్దేశపూర్వకంగా కీలక సమాచారాన్ని దాచినట్లు కంపెనీ నిరూపించాలని తెలిపింది. ఈ కేసులో హెచ్డీఎఫ్సీ లైఫ్ అలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది.
ఈ క్లయిమ్ సరైందేనని, నామినీగా ఉన్న శ్రావణ్ కుమార్ భార్యకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది. 45 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. లేకుంటే.. 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. కాగా ఎప్పుడైనా, ఏ కంపెనీలోనైనా పాలసీ తీసుకుంటే.. తప్పుకుండా అన్ని వివరాలు సమర్పించాలి. లేకంటే మ క్లయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications