తల్లిదండ్రులకు అలర్ట్! సుకన్య సమృద్ధి అకౌంట్లో ఆ తేదీ లోపు డబ్బులు వేయకపోతే భారీ నష్టం!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'బేటీ బచావో, బేటీ పడావో' పథకంలో భాగంగా వచ్చిన 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) ఆడపిల్లల భవిష్యత్తు కోసం అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకం. ఇందులో లభించే ఆకర్షణీయమైన వడ్డీ రేటు, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు, ప్రభుత్వ గ్యారెంటీ రిటర్న్స్ కారణంగా లక్షలాది మంది తల్లిదండ్రులు తమ కుమార్తెల పేరిట ఈ అకౌంట్లను తెరుస్తున్నారు.
అయితే, చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. ఈ పథకంలో మీరు కేవలం డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఏ తేదీన డిపాజిట్ చేస్తున్నారనేది కూడా మీ మెచ్యూరిటీ అమౌంట్‌ను డిసైడ్ చేస్తుంది. ముఖ్యంగా ప్రతి నెల 5వ తేదీ లోపు లేదా ఆ రోజే అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల దీర్ఘకాలంలో భారీ లాభాలను పొందవచ్చు.

అసలు 5వ తేదీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
సుకన్య సమృద్ధి యోజన పథకంలో వడ్డీని లెక్కించే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతి నెల 5వ తేదీ ముగిసినప్పటి నుండి ఆ నెల చివరి రోజు వరకు అకౌంట్లో ఉన్న అత్యంత తక్కువ బ్యాలెన్స్ (Lowest Balance) పై మాత్రమే ఆ నెలకు సంబంధించిన వడ్డీని లెక్కిస్తారు.
దీని అర్థం ఏంటంటే..
- మీరు గనుక ప్రతి నెల 5వ తేదీ లోపు లేదా 5వ తేదీన డిపాజిట్ చేస్తే.. ఆ కొత్త అమౌంట్‌ను కూడా కలిపి ఆ నెల వడ్డీ లెక్కింపులోకి తీసుకుంటారు.
- ఒకవేళ మీరు 5వ తేదీ దాటిన తర్వాత (ఉదాహరణకు 6 లేదా 10వ తేదీన) డబ్బులు వేస్తే, ఆ డబ్బుపై ఆ నెలకు వడ్డీ రాదు. దానికి తర్వాతి నెల నుండి మాత్రమే వడ్డీ లెక్కిస్తారు.
చిన్న ఆలస్యం.. పెద్ద నష్టం!
మీరు ప్రతి నెల రూ. 12,500 చొప్పున ఏడాదికి రూ. 1.5 లక్షలు (గరిష్ట పరిమితి) ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుందాం. ప్రస్తుత SSY వడ్డీ రేటు ఏడాదికి 8.2 శాతంగా ఉంది.
మీరు ప్రతి నెల 3వ తేదీనే రూ. 12,500 అకౌంట్లో వేస్తే, మీకు పూర్తి స్థాయిలో 12 నెలల వడ్డీ క్రెడిట్ అవుతుంది.ఒకవేళ 5వ తేదీ తర్వాత అంటే ప్రతి నెల 10వ తేదీన డబ్బులు వేస్తే, ప్రతి నెలా ఒక నెల వడ్డీని నష్టపోతారు. ఆ లెక్కన నెలకు దాదాపు రూ. 85 వడ్డీ లాస్ అవుతారు.
ఇలా ఏడాదికి రూ. 1,025 వడ్డీ నష్టం వస్తుంది. సుకన్య పథకంలో నియమం ప్రకారం 15 సంవత్సరాల పాటు డబ్బులు కట్టాలి కాబట్టి.. ఈ 15 ఏళ్లలో కేవలం లేట్ డిపాజిట్ వల్ల నేరుగా రూ. 15,375 వడ్డీ నష్టపోతారు. ఇది కేవలం డైరెక్ట్ లాస్ మాత్రమే. దీనికి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ (చక్రవడ్డీ) తోడైతే, 21 ఏళ్ల మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి వచ్చే మొత్తం కొన్ని పదుల వేల రూపాయల వరకు తగ్గిపోతుంది.
గరిష్ట లాభాల కోసం స్మార్ట్ ఐడియా!
మీకు గనుక ఆర్థికంగా వెసులుబాటు ఉంటే, ప్రతి నెలా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అంటే ఏప్రిల్ 5వ తేదీ లోపే ఆ సంవత్సరానికి సంబంధించిన పూర్తి మొత్తం రూ. 1.5 లక్షలను ఒకేసారి డిపాజిట్ చేయడం చాలా ఉత్తమం. దీనివల్ల ఆ పూర్తి మొత్తంపై ఏడాది పొడవునా గరిష్ట వడ్డీ రేటు ప్రయోజనం లభిస్తుంది.
ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో ఫండ్స్ చేతికి రావాలంటే చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అదనంగా ఒక్క రూపాయి కూడా పెట్టకుండా, కేవలం మీ డిపాజిట్ టైమింగ్‌ను మార్చడం ద్వారా మీ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ బ్యాలెన్స్‌ను పెంచుకోవచ్చు. కాబట్టి ఇకపై ప్రతి నెల 5వ తేదీ లోపే SSY అకౌంట్లో డబ్బులు వేయడం అలవాటు చేసుకోండి.


Click it and Unblock the Notifications