ఈ పథకంలో పెట్టుబడి పెడితే.. పిల్లలు పెద్దయ్యే నాటికి చేతికి రూ.70 లక్షలు వస్తాయి! పూర్తి వివరాలు ఇదిగో..
sukanya samriddhi yojana: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం.. తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కూతురి చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఈ ఫండ్ పనికొస్తుంది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పట్నుంచే ఇందులో పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే వాళ్లు పెద్దయ్యే నాటికి పెద్దమొత్తంలో డబ్బు చేతికొస్తుంది. ఇందులో ఎంత పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేటు ఎంత? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్కీమ్ డీటెయిల్స్
సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ పథకాలన్నింటిలో ఇదే ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీమ్. ఇందులో రూ. 250 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే దీన్ని ఏడాదికోసారి కట్టాల్సి ఉంటుంది. 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తూ పోతే 21 ఏళ్లకు మెచ్యూరిటీ అవుతుంది. తర్వాత ఒకేసారి డబ్బు చేతికొస్తుంది.
70 లక్షలు రావాలంటే..
ఈ స్కీమ్ లో ఏడాదికి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే 21 ఏళ్లు వచ్చేసరికి రూ.72 లక్షల నిధి సమకూరుతుంది. ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తే.. మీరు డిపాజిట్ చేసిన మొత్తం రూ. 22.5 లక్షలు అవుతుంది. దీనికి అదనంగా రూ. 49 లక్షల వడ్డీ(8.2% చొప్పున) యాడ్ అవుతుంది. అలా మొత్తంగా మీరు రూ.72 లక్షల నిథిని సమకూర్చుకోవచ్చు. అయితే ఇందులో మెచ్యూరిటీ 21 ఏళ్లకు ఉంటుంది. కానీ, మీరు 15 ఏళ్ల పాటు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 6 ఏళ్లు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే వడ్డీ లభిస్తుంది. ఏడాదికి రూ.1.5 లక్షలు అంటే నెలకు సుమారు రూ.12,500 అవుతుంది..

స్కీమ్ లక్ష్యం ఇదే..
సుకన్య సమృద్ధి యోజన అనేది 'బేటీ బచావో బేటీ పఢావో' ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ప్రారంభించిన పథకం. ఆడపిల్లలకు చదువు, పెళ్లి కొసం అయ్యే ఖర్చులను తీర్చడం కోసం ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చారు. సుకన్య సమృద్ధి యోజనలో ఇప్పటివరకు 4 కోట్లకు పైగా ఖాతాలు తెరవబడ్డాయని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే ఈ స్కీమ్ లో ఇప్పటివరకూ రూ. 3.25 లక్షల కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేశారు.
ఇలా ప్లాన్ చేసుకోండి!
ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందాలంటే.. ఆడపిల్ల పుట్టగానే పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టండి. అలా 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీ చేతికి పెద్ద మొత్తంలో ఫండ్ అందుతుంది. ఏడాదికి రూ.1.5 లక్షలు పెట్టలేకపోతే అందులో సగం రూ.75 వేల చొప్పున అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు స్కీమ్ మెచ్యూరిటీ సమయానికి రూ.36 లక్షలు వస్తుంది. ఇకపోతే ఈ స్కీమ్ కు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.


Click it and Unblock the Notifications