ఈ వారం మార్కెట్ ఎలా ఉండవచ్చు: బంగారం తగ్గుతుందా?
స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ గతవారం కొంత సానుకూలంగా ముగిశాయి. క్రితం వారం బీఎస్ఈ బెంచ్ మార్క్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. గతవారం ప్రారంభంలో సూచీలు భారీగా నష్టపోయినప్పటికీ, ఆ తర్వాత కోలుకున్నాయి. అలాగే, పసిడి మార్కెట్ స్వల్ప సానుకూలతతో ముగిసింది. గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,900 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో పసిడి ఎక్కువగా రూ.47,900 నుండి రూ.48,200 మధ్య కదలాడింది. అయితే ఎక్కువగా రూ.48,000 దిగువనే కనిపించింది. కానీ చివరి సెషన్‌లో రూ.250 పెరిగి, రూ.48,200కు చేరువలో ముగిసింది.

ఒమిక్రాన్ ప్రభావం అంతంతే..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పరిణామాల ప్రభావం స్టాక్ మార్కెట్ పైన కనిపించనుంది. అయితే దీని ప్రభావం అంతంతే అని వెల్లడవడంతో సూచీలు కాస్త పరుగులు పెడుతున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుపై తీసుకునే నిర్ణయం, దేశీయంగా ద్రవ్యోల్భణ గణాంకాలు కీలకం కానున్నాయి. ఒమిక్రాన్, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటు ప్రభావం అటు స్టాక్ మార్కెట్ పైన, ఇటు బులియన్ మార్కెట్ పైన ఉంటుంది. సూచీలు గతవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఒమిక్రాన్ భయాలు తగ్గడం అంతర్జాతీయ, తదనుగుణంగా దేశీయ మార్కెట్‌కు ఊతమిచ్చింది.

మద్దతుస్థాయి
సెన్సెక్స్ ఈ వారం ముందుకే సాగవచ్చునని మార్కెట్ నిపుణుల అంచనా. సెన్సెక్స్ గతవారం ప్రారంభంలో నష్టపోయినప్పటికీ, ఆ తర్వాత కోలుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ తక్షణ నిరోధకస్థాయి 59,100, ఆ తర్వాత 60,000 పాయింట్లు. 58,000 సమీపంలో మద్దతుతో స్వల్పకాలంలో స్థిరీకరణ అవకాశముంది. సెన్సెక్స్ ఇమ్మిడియేట్ సపోర్ట్ 58,120, 57,650. ఇమ్మిడియేట్ రెసిస్టాన్స్ 59,100, 60,430.
నిఫ్టీ గతవారం 17000 స్థాయి కంటే కిందకు పడిపోయినా రికవరి కనిపిస్తుందని, 17,700 స్థాయిలో స్వల్ప నిరోధకం కనిపిస్తోందని చెబుతున్నారు. 17850, 18100 టార్గెట్.

గోల్డ్ ఫ్యూచర్స్
గోల్డ్ ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఈ వారం రూ.47,800 కంటే దిగువన ట్రేడ్ కాకుంటే సానుకూల ధోరణిలో చలించేందుకు అవకాశముంది. ప్రపంచవ్యాప్త పరిణామాలు, ఫెడ్ సమావేశ ముఖ్యాంశాల ప్రభావం గోల్డ్ ఫ్యూచర్ పైన ఉంటుంది. సిల్వర్ ఫ్యూచర్ రూ.62,000 పైన కదలాడితే రూ.62,500 దిశగా, ఆ తర్వాత రూ.62,900కు పెరిగే అవకాశముంది.


Click it and Unblock the Notifications