ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు, బంగారం ధరలు పెరుగుతాయా?
స్టాక్ మార్కెట్లు గతవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ చివరి సెషన్‌లో 632 పాయింట్లు లాభపడి 54,884 పాయింట్ల వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు ఎగిసి 16,352 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు సూచీలు కూడా 1 శాతం కంటే ఎక్కువగా ఎగిశాయి. అదే సమయంలో పసిడి ధరలు కూడా కాస్త పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,000 సమీపంలో ముగిసింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల మద్దతుతో గతవారం మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

అమెరికా మార్కెట్ ఎఫెక్ట్
అమెరికా మార్కెట్లు వరుస నష్టాల నుండి కోలుకోవడం కలిసి వచ్చింది. దేశీయంగా ద్రవ్యోల్భణం నియంత్రణకు ప్రభుత్వం చర్యలు ప్రకటించింది. లోహాలపై ఎగుమతి సుంకాలు, చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇంధన సుంకాలను కూడా తగ్గించింది. ప్రభుత్వ చర్యలతో స్వల్పకాలంలో ద్రవ్యోల్భణ ఒత్తిళ్లు తగ్గవచ్చునని భావిస్తున్నారు. కార్పోరేట్ ఫలితాలు మిశ్రమంగా ఉండటంతో పాటు మార్జిన్స్ పైన ప్రభావం చూపించింది. మే డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు కాస్త ఊగిసలాటలోను కనిపించాయి.

పెరిగిన చమురు ధరలు
సరఫరా ఆందోళన, రష్యాపై యూరోపియన్ యూనియన్ నిషేధం విధించవచ్చుననే ఆందోళనల కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగి 120 డాలర్లకు చేరుకున్నాయి. డాలర్ మారకంతో రూపాయి 77.5 వద్ద ముగిసింది. అయితే అమెరికా మార్కెట్లు వరుసగా ఏడు వారాల అనంతరం పుంజుకున్నాయి. వీటి ప్రభావం సూచీలపై ఉండవచ్చు.

బంగారం, వెండి ధరలు
సెన్సెక్స్ ఈ వారం మద్దతు 54,250, ఆ తర్వాత 53,400 వద్ద కనిపించగా, నిరోధకం 55,000, 56,400 వద్ద కనిపిస్తోంది. నిఫ్టీ నిరోధకం 16,750 వద్ద, మద్దతు 16,200 వరకు కనిపిస్తోంది.
ఇక బంగారం ధరలు ఈ వారం కూడా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం రూ.51,250 క్రాస్ చేస్తే మరింత ముందుకు వెళ్లవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.50,500 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని రూ.50,900 స్థాయిలో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.
సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,600 వద్ద మద్దతు కనిపిస్తోందని, ఈ స్థాయిని కోల్పోతే మాత్రం రూ.61,000 దిగువకు రావొచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications