ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు
స్టాక్ మార్కెట్‌లు ఈ వారం కాస్త సానుకూలంగా కదలాడే అవకాశాలు ఉన్నాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. శనివారం ఐసీఐసీఐ బ్యాంకు నాలుగో త్రైమాసిక ఫలితాలు వచ్చాయి. నికర లాభం అంచనాలు మించి దాదాపు 60 శాతం పెరిగింది. ఈ ప్రభావం బ్యాంకింగ్ స్టాక్స్ పైన ఉంటుంది. అలాగే, వివిధ ఐటీ కంపెనీల ఫలితాల ప్రభావం కూడా ఉంటుంది. అంతకుముందు రెండు వారాలు పైపైకి చేరిన పసిడి ధరలు, గతవారం మాత్రం క్షీణించాయి. ఈ వారం కూడా అలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సూచీలపై వీటి ప్రభావం
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హిందూస్తాన్ యూనీలీవర్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, మారుతీ సుజుకీ, అల్ట్రా టెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంకు, విప్రో ఫలితాలు ఈ వారం వెల్లడవుతున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ మే సమావేశంలో వడ్డీ రేట్లను పెంచవచ్చుననే అంచనాలు మార్కెట్ పైన ఉన్నాయి. అదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాలు, ముడి చమురు ధరలు, డెరివేటివ్ కాంట్రాక్ట్స్ గడువు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి.
ముడి పదార్థాలు, రవాణా వ్యయం, ద్రవ్యోల్భణంపై కంపెనీల వ్యాఖ్యల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నందున ఔషధ షేర్లు స్తబ్దుగా కదలాడే అవకాశాలున్నాయి.
ఐటీ స్టాక్స్ ఇటీవల దిద్దుబాటుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో కాస్త సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 29న విప్రో ఫలితాలు ప్రభావం చూపుతాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు 8.7 శాతం నుండి 8 శాతానికి తగ్గించడం గతవారం ప్రభావం చూపింది. చమురు ధరల పెరుగుదల ప్రభావమూ ఉంది.

మద్దతు, నిరోధకం
సెన్సెక్స్ గతవారం 57,197 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17,172 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం సెన్సెక్స్ 2 శాతం, నిఫ్టీ 1.7 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ ఈ వారం 16,800 నుండి 17,500 మధ్య కదలాడవచ్చునని మార్కెట్ వర్గాల అంచనా. సెన్సెక్స్ 57,700 నుండి 58,500 మధ్య కదలాడవచ్చు. సెన్సెక్స్ మద్దతు 56,500, నిరోధకం 59,000 వరకు కనిపిస్తోంది.

బంగారం ధరలు
బంగారం ధరలు ఈ వారం కూడా క్షీణించే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. గోల్డ్ జూన్ ఫ్యూచర్‌కు రూ.51,690 వద్ద మద్దతు లభించే అవకాశముంది. ఈ స్థాయి దిగువకు పడిపోతే రూ.51,100 స్థాయికి చేరుకోవచ్చు. పైకి చేరుకుంటే మాత్రం రూ.53,300 స్థాయికి పెరగవచ్చునని భావిస్తున్నారు. వెండి ధరలు రూ.64,900 స్థాయి కంటే పడిపోతే రూ.64,000కు దిగి రావొచ్చునని, రూ.69,500కు చేరుకుంటే మాత్రం రూ.70,000ను దాటే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.


Click it and Unblock the Notifications