ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు, బంగారం ధరలు పెరుగుతాయా?
స్టాక్ మార్కెట్లు గతవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ అననుకూల సంకేతాలు, ద్రవ్యోల్భణ భయాలు, అమెరికా ద్రవ్యోల్భణం మేలో 40 ఏళ్ల గరిష్టం 8.6 శాతానికి చేరుకోవడం, పెరుగుతున్న కరోనా కేసులకు తోడు ఆర్బీఐ సహా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతుండటం మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో గతవారం సెన్సెక్స్ ఏకంగా 1460 పాయింట్లకు పైగా క్షీణించింది. అంటే రెండున్నర శాతం కంటే ఎక్కువగా పతనమైంది. ఈ వారం కూడా రెపో రేటు వంటి అంశాలు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో బంగారం ధరల దూకుడు కొనసాగవచ్చునని చెబుతున్నారు.
అంతర్జాతీయ పరిణామాలతో సూచీలు ఒడిదుడుకులకు లోను కావొచ్చునని అంటున్నారు. అమెరికా ఫెడ్ పరపతి నిర్ణయాలు బుధవారం వెలువడుతున్నాయి. ఈసారి మరో 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయంగా చూస్తే రిటైల్, హోల్ సేల్ ద్రవ్యోల్బణ గణాంకాల నుండ సంకేతాలు ఉండవచ్చు. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గవచ్చుననే అంచనాలున్నాయి. ఇంధనంపై ట్యాక్స్ కోత, బేస్ ఎఫెక్ట్ ప్రభావం సానుకూలంగా ఉండవచ్చునని అంటున్నారు.

ఈ వారం సెన్సెక్స్ 53,400కు కాస్త అటు ఇటుగా మద్దతు, 55,500 స్థాయిలో నిరోధకం కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ బ్రేక్ ఔట్ స్థాయి 16500 వద్ద, బ్రేక్ డౌన్ స్థాయి 15800 స్థాయిలో కనిపిస్తోంది.
బంగారం ధరలు ఈ వారం కాస్త సానుకూలంగా కదలాడవచ్చు. గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్‌కు ఈ వారం రూ.50,500 వద్ద మద్దతు, ఈ స్థాయి కంటే కిందకు వస్తే మాత్రం రూ.49,900 స్థాయిలో కదలాడవచ్చునని చెబుతున్నారు. ఒకవేళ ధరలు పెరిగితే మాత్రం రూ.51,500 స్థాయి వద్ద నిరోధకం ఎదురు కావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సిల్వర్ ఫ్యూచర్స్‌కు రూ.60,500 వద్ద మద్దతు కనిపిస్తోందని, ఈ స్థాయిని కోల్పోతే రూ.60,000 దిగువకు వస్తుందని, సానుకూలంగా ఉంటే మాత్రం రూ.63,000 దిశగా కనిపిస్తోందని అంటున్నారు.


Click it and Unblock the Notifications