ప్రయివేటు లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ బజాజ్ అలియంజ్ సరికొత్త టర్మ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. స్మార్ట్ ప్రొటెక్ట్ గోల్డ్ పేరుతో ఈ కొత్త టర్మ్ పాలసీని విడుదల చేసింది. ఖాతాదారులు తమ జీవిత లక్ష్యాలను చేరేందుకు వీలుగా గత రెండేళ్లుగా తమ కంపెనీ పాలసీలను రూపొందిస్తోందని, ఇందులో భాగంగా దీనిని ప్రవేశ పెట్టినట్లు సంస్థ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ ధీరజ్ సెహగాల్ అన్నారు.

పిల్లల చదువులకు అదనపు రక్షణ
తక్కువ ప్రీమియంతో గరిష్ట రక్షణ కల్పించే లక్ష్యంతో బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సురెన్స్ ఈ టర్మ్ ప్లాన్ తీసుకు వచ్చింది. మొదటిసారి టర్మ్ పాలసీలో పిల్లల చదువుల కోసం అదనపు రక్షణ తీసుకునేలా ఈ ప్లాన్ ఉంది. అలాగే, 55 క్రిటికల్ రుగ్మతలకు కూడా కవరేజ్ ఉంది. పూర్తి రక్షణకే పరిమితమయ్యే టర్మ్ ప్లాన్ ఇది.

అదనపు ప్రీమియంతో ప్రత్యేక కవరేజీలు..
ఈ టర్మ్ పాలసీలో కంపెనీ కొన్ని ప్రత్యేక కవరేజీలు కూడా అందిస్తోంది. అయితే వీటికి అదనపు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ఇది ఇండివిడ్యువల్, నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ ప్యూర్ రిస్క్ టర్మ్ ప్లాన్.

రోజుకు రూ.13తో రూ.1 కోటి బీమా
ఈ టర్మ్ పాలసీలో 25 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల వ్యవధికి రూ.1 కోటి పాలసీ తీసుకుంటే రోజుకు రూ.13 చెల్లించాలి. అంటే వార్షిక ప్రీమియం రూ.4,764 అవుతుంది. అయితే పన్నులు అదనంగా ఉంటాయి. పొగ తాగని వ్యక్తికి ఇది వర్తిస్తుంది. పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత ప్రీమియం వెనక్కి ఇచ్చే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీదారుడికి ఏదైనా జరిగితే పిల్లల చదువుల కోసం అదనంగా కొంత మొత్తం చెల్లించే రైడర్‌ను ఎంచుకోవచ్చు. పాలసీని జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా తీసుకోవచ్చు. 85 ఏళ్ల వయస్సు దాకా పాలసీని కొనసాగించవచ్చు.

ఆర్థిక మందగమన ప్రభావం..
బజాజ్ అలియంజ్ పైన ఆర్థిక మందగమన ప్రభావం లేదని ధీరజ్ సెహగాల్ చెప్పారు. బజాజ్ అలియంజ్ లైఫ్ ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 19 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు చెప్పారు. 2018-19లో రూ.2,719 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ.3,242 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications