Smart investments: సేవింగ్స్ కోసం ఈ 5 సూత్రాలు పాటించండి
వ్యాపారం లేదా ఉద్యోగం లేదా ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయంలో కొంత ఖర్చు పోను, మిగతా మొత్తాన్ని సేవింగ్స్ కోసం ఉపయోగించడం మంచిది. కరోనా తర్వాత సంపాదనలో సేవింగ్స్ కోసం ఉపయోగించడం లేదా పెట్టుబడి పెట్టడం పెరిగింది. ఎక్కువమంది ఈ దిశగా దృష్టి సారిస్తున్నారు. అయితే ఈ పెట్టుబడి లేదా సేవింగ్స్ కూడా సరైన దిశలో చేయడమే తెలివైన పని. స్టాక్స్ నుండి గోల్డ్ బాండ్స్ వరకు, బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్స్ నుండి ఎఫ్‌డీ వరకు, ఇవి కాకుండా పోస్టాఫీస్ పెట్టుబడులు, సుకన్య సమృద్ధి యోజన, పీఎఫ్ పెట్టుబడులు ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి.
అయితే మనకు ఏది అనువైనది అనేది ఆలోచించి, ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో చూసుకోవాలి. పెట్టుబడి పెట్టడానికి ముందు కాలపరిమితి, వడ్డీ రేటుతో పాటు రిటర్న్స్, మన గోల్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇంటి కొనుగోలు, పిల్లల విద్య, రిటైర్మెంట్ ప్లాన్ తదితర ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే కాదు.. వాటిని సరైన దిశలో ఉపయోగించడం ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది. అంటే స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం.

ఎక్కువ సమయం ఉంటుంది...
మన ఫైనాన్షియల్ గోల్ ప్లానింగ్ పెట్టుబడులపై వచ్చే రిటర్న్స్ ఆధారంగా ఉండాలి. అందుకే సంపాదించడం ప్రారంభించినప్పటి నుండే సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ సరైన నిర్ణయం మాత్రమే కాదు... తెలివైన నిర్ణయం కూడా. ప్రారంభం నుండి లేదా ఎర్లీ ఏజ్ నుండి పొదుపును ప్రారంభిస్తే మున్ముందు వచ్చే ఆర్థిక సంక్షోభం నుండి సులభంగా గట్టెక్కవచ్చు.
చిన్న చిన్న మొత్తంతో పొదుపును ప్రారంభిస్తే, కొన్నేళ్ల తర్వాత మీ చేతికి పెద్ద మొత్తం వస్తుంది. అంటే పొదుపు చేసేందుకు ఒకేసారి పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలి. దీర్ఘకాలంలో పెట్టుబడి పెడితే రిటర్న్స్ మరింత ఫలప్రదంగా ఉంటాయి. పిన్న వయస్సులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే కూడబెట్టుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది.

ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి
మన సేవింగ్స్‌లో ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఉండాలి. ఉద్యోగం కోల్పోవడం లేదా వైద్య అత్యవసర పరిస్థితుల్లో లేదా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఈ అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. కరోనా మహమ్మారి కాలంలో ఎమర్జెన్సీ ఫండ్ ఆవసరం దాదాపు అందరికీ తెలిసింది. ఎమర్జెన్సీ ఫండ్‌ను ఎంచుకుంటే అత్యవసర సమయంలో ద్రవ్యంలోకి సులభంగా మార్చుకునేలా ఉండాలి.

ఆర్థిక లక్ష్యం
ఆర్థిక లక్ష్యాన్ని కలిగి ఉండటం ఆర్థిక స్వాతంత్రానికి తొలిమెట్టు. మన లక్ష్యం ఆధారంగా పెట్టుబడి పెట్టాలి. ఉన్నత విద్య, పిల్లల చదువులు, ప్రపంచ పర్యటన వంటి లక్ష్యాలను ఎంచుకోవాలి. మీరు స్పష్టమైన లక్ష్యాలు, ప్రణాళిక ప్రకారం పెట్టుబడిని పెట్టాలి.

అప్పులు తీర్చేయాలి
ఆర్థిక స్వాతంత్రం కోల్పోవడానికి ప్రధాన కారణం అప్పులు. ఇష్టారీతిన అప్పులు చేసి, వాటిని తీర్చడం కోసం ఇబ్బందులు పడవద్దు. మీకు ఏదైనా అప్పు ఉంటే దానిని సాధ్యమైనంత త్వరగా తీర్చే ప్రయత్నం చేయాలి. ఆర్థిక స్వాతంత్రం ఉండాలంటే మొదట మీ అప్పులన్నీ తీరిపోయినట్లుగా నిర్ధారించుకోవాలి. అయితే స్టూడెంట్ లోన్స్ వంటివి అవసరమవుతాయి. మీ బడ్జెట్ ఆధారంగా దీనిని పరిగణలోకి తీసుకోవాలి.

ఆర్థిక సలహాలు తీసుకోవాలి
పెట్టుబడులు లేదా సేవింగ్స్ కోసం నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. సేవింగ్స్‌కు సంబంధించి ఫాల్స్ రికమండేషన్స్ ఉచ్చులో పడవద్దు. రాంగ్ అసెట్స్ క్లాస్‌లో ఇన్వెస్ట్ చేస్తే బోర్లా పడాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఏది యాప్ట్ అవుతుంది, ఎంత కాలపరిమితి వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని, నిపుణుల సలహాలు తీసుకోవాలి. రిస్క్ ప్రొఫైల్‌ను కూడా చూసుకోవాలి.


Click it and Unblock the Notifications