FY22లో అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చిన స్మాల్ క్యాప్ స్టాక్స్
2021-22 ఆర్థిక సంవత్సరంలో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY23)లోను ఈ స్టాక్స్ అదిరిపోయే రిటర్న్స్ ఇస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం(FY22) చివరలో రష్యా-ఉక్రెయిన్ వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్భణం ఆందోళనలు, ఎఫ్ఐఐ అమ్మకాలు వెల్లువెత్తడం వంటి వివిధ ప్రతికూల అంశాల కారణంగా రిటర్న్స్ కాస్త తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం బాగుందని, ద్వితీయార్థంలో మార్కెట్ కన్సాలిడేషన్‌లోకి ప్రవేశించిందని, అధిక ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్మాల్ క్యాప్ అదుర్స్
2021-22 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 7,566.32 పాయింట్లు లేదా 36.64 శాతం ఎగిసిపడింది. అదే మిడ్ క్యాప్ సూచీ ఇండెక్స్ 3,926.66 పాయింట్లు లేదా 19.45 శాతం లాభపడింది.
అదే సమయంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 9,059.36 పాయింట్లు 18.29 శాతం పెరిగింది. అంటే సెన్సెక్స్ జంపింగ్‌తో పోలిస్తే స్మాల్ క్యాప్ సూచీ రెండింతలు వృద్ధిని నమోదు చేసింది. స్మాల్ క్యాప్‌తో పాటు మిడ్ క్యాప్ సూచీలు కూడా FY23లోను మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఉత్తమమైన నెలగా..
ఈక్విటీ మార్కెట్‌కు ఏప్రిల్ నెల ఉత్తమమైన నెలల్లో ఒకటిగా ఉంటోందని, ముఖ్యంగా బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీలకు గత పదిహేనేళ్లులో 14సార్లు ఏడాదికి 7 శాతం చొప్పున రిటర్న్స్ వచ్చాయని, అందుకే FY23 కూడా గొప్ప ప్రారంభంగా భావిస్తున్నట్లు స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 19వ తేదీ, 2021న సెన్సెక్స్ 20,282.07 పాయింట్ల వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకిన తర్వాత గత జనవరి 18న31,304.44 వద్ద ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది.
గత ఏడాది అక్టోబర్ 19న మిడ్ క్యాప్ గేజ్ రికార్డ్ గరిష్టం 27,246.34కు చేరుకుంది. అంతకుముందు ఏప్రిల్ 19, 2021న 19,423.05 వద్ద 52వారాల కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ అక్టోబర్ 19, 2021న ఆల్ టైమ్ గరిష్టం 62,245.43ను తాకింది.

విస్తృత కరెక్షన్
గత ఐదారు నెలల్లో మార్కెట్ విస్తృత కరెక్షన్ కారణంగా FY23కి మిడ్, స్మాల్ సూచీలు మంచి పెట్టుబడి అంశాలుగా మారుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్మాల్ క్యాప్స్... లార్జ్, మిడ్ క్యాప్ కంటే చౌకగా ట్రేడ్ అవుతున్నాయి. ఫార్వార్డ్ ఎర్నింగ్స్ గ్రోత్‌తో ఇన్వెస్టర్లు ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.
అయితే అధిక ద్రవ్యోల్భణ భయాలు, ఆర్థిక వ్యవస్థలో మందగమనం, భవిష్యత్తు ఆదాయాలలో డౌన్ గ్రేడ్ అనిశ్చితి కారణంగా స్వల్పకాలంలో అస్థిరత ఉండవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications