గత కొన్ని వారాలుగా బంగారం (Gold), వెండి (Silver), ఇతర విలువైన లోహాల మార్కెట్ అత్యంత ఒడిదుడుకులకు లోనైంది. ముఖ్యంగా వెండి (Silver) ధరలు ఆకాశం నుంచి ఒక్కసారిగా పాతాళానికి పడిపోయి.. మళ్లీ ఇప్పుడు కోలుకుంటున్నాయి. కేవలం మూడు సెషన్లలోనే దాదాపు 46% పైగా పతనమైన వెండి ధరలు.. మంగళవారం ఎంసీఎక్స్ (MCX) మార్కెట్ లో ఒకేరోజు 6% పైగా పెరిగి ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తించాయి. ఈ క్రమంలో Silver ETF (సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) విభాగంలో కూడా 8% నుండి 9% వరకు భారీ పెరుగుదల కనిపించింది. దీంతో చాలా మంది సిల్వర్ ఈటీఎఫ్ లలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే అసలు ఈటీఎఫ్ లను ఎలా ఎంచుకోవాలి?

అసలు సిల్వర్ ఈటీఎఫ్ (Silver ETF) అంటే ఏమిటి?
చాలామందికి వెండిని భౌతికంగా (బిస్కెట్లు లేదా కడ్డీల రూపంలో) కొని ఇంట్లో భద్రపరచుకోవడం కష్టంగా అనిపిస్తుంది. దొంగల భయం లేదా లాకర్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారి కోసం 'సిల్వర్ ఈటీఎఫ్' ఒక అద్భుతమైన అవకాశం. ఇది వెండి ధరలను నేరుగా ట్రాక్ చేసే ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్. మీరు షేర్ మార్కెట్‌లో స్టాక్స్ ను కొన్నట్లుగానే వీటిని కూడా మీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెండి నాణ్యత (Purity) లేదా భద్రత గురించి చింతించాల్సిన అవసరం లేదు.
సరైన Silver ETF ని ఎంచుకోవడం ఎలా?
మార్కెట్‌లో ఎస్‌బీఐ, జెరోధా, నిప్పాన్ ఇండియా, కోటక్ వంటి అనేక సంస్థలు సిల్వర్ ఇటిఎఫ్‌లను అందిస్తున్నాయి. అయితే ఒక ఇన్వెస్టర్‌గా మీరు వీటిని ఎంచుకునేటప్పుడు రెండు కీలక విషయాలను గమనించాలి..
- లిక్విడిటీ (Liquidity): మార్కెట్‌లో ట్రేడింగ్ వాల్యూమ్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ యూనిట్లను అమ్ముకుని నగదుగా మార్చుకోగలరు.
- ఎక్స్‌పెన్స్ రేషియో (Expense Ratio): ఫండ్ మేనేజ్‌మెంట్ కోసం వసూలు చేసే రుసుము వీలైనంత తక్కువగా ఉండాలి. తక్కువ ఖర్చు ఉంటేనే దీర్ఘకాలంలో మీ లాభం పెరుగుతుంది.
- ప్యానిక్ సెల్లింగ్ వద్దు: వెండి మార్కెట్ బంగారం కంటే చిన్నది. కాబట్టి ధరలు చాలా వేగంగా మారుతుంటాయి. ధరలు పడిపోయినప్పుడు భయపడి అమ్మేయడం (Panic Selling) లేదా బాగా పెరిగినప్పుడు అత్యాశతో భారీగా కొనడం లాంటివి చేయకూడదు. సిల్వర్ ఈటీఎఫ్ అనేది లాంగ్ టర్మ్ లో మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి తొందర పడడం మంచిది కాదు.
ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనల వల్ల మార్కెట్ మళ్ళీ ఊపందుకుంది. అయితే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యం ఉంటేనే Silver ETF వైపు వెళ్లడం మంచిది. మీ అవసరాలకు తగ్గట్టుగా సిస్టమాటిక్ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం వల్ల వెండి ఇచ్చే లాభాలను సురక్షితంగా అందుకోవచ్చు.


Click it and Unblock the Notifications