వెయిట్ అండ్ వాచ్: మార్కెట్ భారీ పతనం.. ఇన్వెస్ట్ చేయవచ్చా?
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 21) భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా పతనమైంది. ఓ సమయంలో 2000 పాయింట్లు దిగజారింది. ఆ తర్వాత కాస్త కోలుకొని 45,553 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 3.2 శాతం మేర క్షీణించి 13,328 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 4 శాతం చొప్పున నష్టపోయాయి. అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. ఆరు రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్ పడింది.

మధ్యాహ్నం తర్వాత..
ఉదయం 46,837 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత బారీగా నష్టపోయింది. రెండువేల పాయింట్ల మేర జారింది. ప్రభుత్వరంగ సూచీ 7 శాతం నష్టపోయింది. ఓ వైపు కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సిద్ధమవుతున్న సమయంలో బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ వెలుగు చూడటం కలవరపెట్టింది. 70 శాతం వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాలు ఆంక్షల్లోకి వెళ్లాయి. భారత్ సహా పలు దేశాలు విమాన సర్వీసులు నిలిపివేశాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

వరుస లాభాల్లో ప్రాఫిట్ బుకింగ్
గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలలతో, జీవన కాల గరిష్టాలను తాకాయి. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో కరెక్షన్ బాటపట్టాయి. దీంతో వరుస లాభాల్లోకి వెళ్లినప్పుడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం కూడా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కూడా పడటంతో భారీ నష్టాలు చవిచూశాయి.

వెయిట్ అండ్ వాచ్
కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 23వ తేదీన కూడా మార్కెట్లు పతనమయ్యాయి. ఆ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఆ తర్వాత మంచి రిటర్న్స్ వచ్చాయి! ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూడా భారీగా పడిపోయిన సమయంలో ఇన్వెస్ట్ చేయవచ్చా అనే ఆలోచన కొంతమందిలో ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి మరికొన్ని సెషన్లు వేచిచూడాలని, మరింత కరెక్షన్‌కు ఆస్కారం లేకపోలేదని అంటున్నారు. ఇందుకు విదేశాల్లో కొత్త వైరస్, మన మార్కెట్లలో ఇటివలీ కాలంలో భారీగా ఎగిసిన మార్కెట్లు మరింత కరెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications