మార్కెట్ దూకుడు: కొనుగోళ్లకు తొందరొద్దు! ఈ షేర్లతో భారీ లాభాలు!!
ముంబై: ఈ వారం మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. ఈ వారంలో మార్కెట్లు మూడు రోజులు (మంగళ, బుధ, గురువారాలు) మాత్రమే ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తుందనే వార్తల నేపథ్యంలో పది శాతానికి పైగా పుంజుకున్నాయి. అయితే ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని, కొనుగోళ్లపై తొందరపడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

రూ.120 లక్షల కోట్లకు చేరిన సంపద
కేంద్ర ప్రభుత్వం రెండో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తుందనే వార్తల నేపథ్యంలో మార్కెట్లు లాభాలను మూటగట్టుకుంటున్నాయి. బుధ, గురువారాలు మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ నిన్న 1266 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 9,100 పాయింట్లకు చేరుకుంది. డాలర్ మారకంతో రూపాయి 76.28 వద్ద క్లోజ్ అయింది. దీంతో BSE లిస్టెడ్ కంపెనీల ఇన్వెస్టర్ల సంపద నిన్న (గురువారం) ఒక్కరోజే రూ.3.98 లక్షల కోట్లు పెరిగి రూ.120.81 లక్షల కోట్లకు చేరుకుంది.

అందుకే కొనుగోళ్ల దిశగా..
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. దీంతో జరిగే నష్టాల నివారణ కోసం కేంద్రం ఇదివరకే రూ.1.70 లక్షల కోట్లతో ఉద్దీపనలు ప్రకటించింది. ఇప్పుడు రెండో ప్యాకేజీకి సిద్ధమవుతోందనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తిరిగి కోలుకోవడం కూడా ఇన్వెస్టర్లకు కొనుగోళ్ల దిశగా నడిపించింది.

ఏడు వారాల నష్టాలకు బ్రేక్
గురువారం సెన్సెక్స్ 1,266 పాయింట్లు ఎగిసి 31,160 పాయింట్ల వద్ద, నిఫ్టీ 363 పాయింట్లు పెరిగి 9,112 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యాయి. పర్సెంటేజీ పరంగా చూస్తే సెన్సెక్స్ 4.23 శాతం, నిఫ్టీ 4.15 శాతం చొప్పున పెరిగాయి. రెండ్రోజుల సెలవుల కారణంగా ఈ వారంలో ట్రేడింగ్ 3 రోజుల పాటే ఉంటుంది. రెండు సూచీలు చెరో దాదాపు 13 % లాభపడ్డాయి. ఏడు వారాల వరుస నష్టాలకు ఈ వారం బ్రేక్ పడింది.

ఐనా తొందరొద్దు..
ఇటీవలి స్టాక్ మార్కెట్ ఉత్తానం బేర్ మార్కెట్ ర్యాలీ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రికవరీ ప్రారంభమైందని భావించి కొనుగోళ్లకు ఎక్కువగా తొందరపడవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుత పెరుగుదల స్వల్పకాలికం కాదనలేమని అంటున్నారు. కరోనా కేసులు, మరణాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కరోనా ప్రభావం పెరిగితే ర్యాలీ కొనసాగకపోవచ్చునని అంటున్నారు.

ఈ షేర్లు భారీ లాభాలు ఇచ్చే అవకాశం
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ 21 రోజుల లాక్ డౌన్ సత్ఫలితాలు ఇవ్వగలదనే విషయం రానున్న రోజుల్లో వెల్లడి కానుందని చెబుతున్నారు. FMCG రంగ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్ల వేల్యూయేషన్లు ఇప్పుడు సమంజసంగానే ఉన్నాయని చెబుతున్నారు. బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా, నిర్వహణ సామర్థ్యం ఉండి, మార్కెట్ లీడర్లుగా ఉన్న షేర్ల వైపు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు. ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఈ షేర్లు మంచి రాబడులను ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications