స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను తాకాయి. ప్రాఫిట్ బుకింగ్ లేకుంటే, అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు ఉంటే నేడు సెన్సెక్స్ ఏకంగా 60,000 పాయింట్లకు పైగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ నేడు ఈ మార్కును తాకవచ్చునని మార్కెట్ నిపుణుల అంచనా. ప్రపంచ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు రావడం నిన్న సూచీల పరుగుకు దోహదపడింది. స్మాల్, లార్జ్, మీడియం.. ఇలా అన్ని రంగాల స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. సూచీల భారీ లాభాల్లో దాదాపు సగం క్రెడిట్ రిలయన్స్, HDFC, HDFC బ్యాంకు స్టాక్స్‌కు దక్కుతుంది. నేడు సెన్సెక్స్ మరో 115 పాయింట్లు లాభపడితే చారిత్రాత్మక 60,000 పాయింట్లకు చేరుకుంటుంది.

ఈ అంశాలు అదుర్స్
దేశీయ మార్కెట్లు పరుగులు పెట్టడానికి అంతర్జాతీయ అంశాలు, దేశీయంగా ఆర్థిక రికవరీ వేగం అందుకోవడం వంటి అంశాలు దోహదం చేశాయి. అలాగే చైనా ఎవర్ గ్రాండ్ ప్రకటన కూడా కలిసి వచ్చింది. అమెరికా ఫెడ్ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. అంటే ప్రధానంగా అమెరికా, చైనా, భారత్ అంశాలు మార్కెట్ పరుగుకు కారణమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ ఉద్దీపనలను 2022 మిడిల్ నాటికి నిలిపివేస్తామని, నవంబర్ నుండి బాండ్స్ కొనుగోలును తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది. ఎవర్ గ్రాండ్ కూడా బాండ్స్‌కు వడ్డీని చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో ప్రపంచం మరోసారి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందా అనే ఆందోళన నుండి ఊరట లభించింది. ఇక మన దేశం విషయానికి వస్తే కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వేగవంతం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. విదేశీ పెట్టుబడుల ప్రభావం, బ్యాంకింగ్ క్యాపిటల్ గూడ్స్ షేర్ల మద్దతు, రియాల్టీ జూమ్, ఆర్థిక రికవరీపై ఆశాభావం కలిసి వచ్చింది. అయితే నిన్న మార్కెట్ పరుగు నేపథ్యంలో నేడు ప్రాఫిట్ బుకింగ్ ఆస్కారం ఉండవచ్చు.

రిలయన్స్ రూ.16 లక్షల కోట్లు...
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16 లక్షల కోట్లను క్రాస్ చేసింది. బీఎస్ఈలో 2.43 శాతం లాభంతో ఈ స్టాక్ రూ.2,489 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.2.72 శాతం ఎగిసి రూ.2,495 వద్ద క్లోజ్ అయింది. దీంతో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.16 లక్షల కోట్లను దాటింది. కానీ ట్రేడింగ్ ముగిసే సమయానికి స్టాక్ రూ.2489.65 వద్ద ముగిసి మార్కెట్ క్యాప్ రూ.1578299.46 వద్ద నిలిచింది.
నిన్నటి దూకుడు తర్వాత టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్..
- రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1578299.46,
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.1431052.00,
- HDFC బ్యాంకు లిమిటెడ్ రూ.869518.38,
- ఇన్ఫోసిస్ రూ.738806.11,
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ రూ.653621.05,
- HDFC రూ.509368.30,
- ఐసీఐసీఐ బ్యాంకు రూ.497391.73,
- బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ.476685.62,
- ఎస్బీఐ రూ.401429.03,
- కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.401383.84

సంపద జూమ్
మార్కెట్ ర్యాలీతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకేరోజు రూ.రూ.3,16,778 కోట్లు పెరిగింది. అంటే ఇన్వెస్టర్ల సంపద ఈ మేరకు ఎగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.261.73 లక్షల కోట్లకు చేరుకుంది. మార్కెట్ క్యాప్‌లో సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి ఇది.


Click it and Unblock the Notifications