వచ్చే ఏడాదికి సెన్సెక్స్ 80,000 మార్క్‌కు! ఇవి భారీగా జంప్ చేశాయి
వచ్చే ఏడాదికి సెన్సెక్స్ 80,000 మార్కు చేరుకోవచ్చునని బ్రోకరేజీ సంస్థలు, మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత స్టాక్ మార్కెట్ కరోనా అనంతరం అదరగొడుతున్నాయని, ఇది మరింతకాలం కొనసాగుతుందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. వచ్చే రెండు దశాబ్దాలు భారత మార్కెట్ ఇదే దూకుడు కొనసాగిస్తుందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో బుల్ మార్కెట్ 70,000 నుండి 80,000 చేరుకోవచ్చునని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. 2022 డిసెంబర్ నాటికి 70,000 మార్కు చేరుకుంటుందని, బుల్ మార్కెట్ దూకుడు మరింత వేగవంతమైతే 80,000కు చేరుకుంటుందని చెబుతోంది.

80,000 స్థాయికి...
ప్రస్తుతస్థాయులతో పోలిస్తే సూచీ దాదాపు 17 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గత పద్దెనిమిది నెలలుగా భారత స్టాక్ మార్కెట్ వేగంగా పరుగు పెడుతోందని, అందుకే 2022లో తగ్గుముఖం కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతోంది. అమెరికాలో కీలక వడ్డీ రేట్ల పెంపు, చమురు ధరల పెరుగుదల, దేశీయంగా కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు, కరోనా మూడో వేవ్ ఆందోళన వంటి అంశాలు భారత మార్కెట్ పైన, ఆర్థిక రికవరీ పైన ప్రభావం చూపుతాయని పేర్కొంది.
అయినా మార్కెట్ బుల్లిష్ ధోరణితో కనిపిస్తోందని, అందుకే డిసెంబర్ 2022 నాటికి 70,000 మార్కుకు చేరుకోవడానికి 50 శాతం అవకాశాలు ఉన్నాయని, 80,000కు చేరుకోవడానికి 30 శాతం అవకాశాలు ఉన్నాయని తెలిపింది. బేర్ మార్కెట్ పడిపోతే మాత్రం 50,000 స్థాయికి చేరుకుంటుందని, అయితే ఇందుకు 20 శాతం అవకాశాలే ఉన్నాయని పేర్కొంది.

సంస్కరణలు
భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన విధాన సంస్కరణలు జీడీపీ వృద్ధి రేటు పెరిగేందుకు దోహదం చేస్తాయని, అది స్టాక్ మార్కెట్లకు కలిసి వస్తుందని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. స్వచ్ఛ ఇంధనానికి కేటాయింపులు పెరగడం, దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ, స్థిరాస్తి, వాహన, విమానయాన రంగాలు పుంజుకుంటుండటం, రుణాల జారీలో వృద్ధి, జీవిత బీమా, డిజిటలీకరణ, వినియోగస్థాయులు పెరుగుతుండటం, విద్యుత్ వాహనాల వంటి అంశాలు 2022లో స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని వెల్లడించింది.

భారీ పెరుగుదల
ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు సెన్సెక్స్ దాదాపు 25 శాతం పెరిగిందని, మధ్య, చిన్న తరహా కంపెనీల షేర్ల సూచీలు ఏకంగా 45 శాతం, 59 శాతం వరకు రాణించాయని గుర్తు చేసింది. పవర్, రియాల్టీ, మెటల్, భారీ యంత్రపరికరాల రంగాల షేర్లు 51 శాతం నుండి 73 శాతం వరకు లాభపడ్డాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల దృష్టితో చూస్తే భారత్‌లో ప్రస్తుత ఈక్విటీ వ్యాల్యూ అధికంగానే ఉందని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications