నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: పేటీఎం అదుర్స్, ఈ స్టాక్స్ 15% జంప్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, చివరకు నష్టాల్లో ముగిశాయి. సోమవారం భారీ దిద్దుబాటు నుండి నిన్న కోలుకున్న సూచీలు నేడు ఉదయం లాభాలను కొనసాగించే దిశగా కనిపించాయి. కానీ చివరి గంటలో నష్టాల్లోకి వెళ్లాయి. దీంతో సూచీలు భారీగా పతనం అయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కనిపించినప్పటికీ, చివరకు నష్టపోయాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ సూచీలు ఒక శాతం చొప్పున నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్ల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.5 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.4 శాతం నష్టపోయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో HDFC బ్యాంకు, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బీపీసీఎల్, కొటక్ మహీంద్రా ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, ఐచర్ మోటార్స్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, గ్రాసీమ్ ఉన్నాయి.
రిలయన్స్ షేర్ నేడు ఉదయం లాభపడినప్పటికీ చివరకు 1.77 శాతం మేర నష్టపోయింది.

పేటీఎం అదుర్స్
పేటీఎం స్టాక్ వరుసగా రెండో రోజు అదరగొట్టింది. లిస్టింగ్ రోజు నుండి వరుసగా రెండు రోజుల పాటు భారీగా పతనమైన ఈ స్టాక్ నిన్నటి నుండి లాభపడుతోంది. నిన్న స్వల్పంగా లాభపడి రూ.1494 వద్ద ముగిసింది. నేడు ఏకంగా 17.28 శాతం ఎగిసి రూ.1753 వద్ద క్లోజ్ అయింది. రూ.2150 ధరతో జారీ చేసిన ఈ షేర్ రూ.1955 వద్ద లిస్ట్ అయింది. అయితే ఆ తర్వాత రూ.1300 దిగువకు కూడా పడిపోయిన సందర్భం ఉంది. కానీ నిన్న, నేడు లాభపడి ఈ రెండు రోజుల్లో రూ.400 వరకు ఎగబాకింది.

15 శాతానికి పైగా జంప్
మార్కెట్లు నేడు నష్టపోయినప్పటికీ పలు స్టాక్స్ మాత్రం 15 శాతం మేర లాభపడ్డాయి. ఈ మేరకు లాభపడిన స్టాక్స్‌లో డాక్టర్ లాల్ చందానీ ల్యాబ్స్(20.0%), ధ్రువ్ కన్సల్టెన్సీ(20.0%), రియల్ స్ట్రిప్స్ (20.0%), ఉజాస్ ఎనర్జీ (20.0%), సోరిల్ ఇన్ఫ్రా రిసోర్సెస్ (19.99%), సుదాల్ ఇండ్స్(19.97%), ఆస్టిన్ ఇంజినీరింగ్(19.95%), క్యాపిటల్ ట్రేడ్ లింక్స్ (19.87%), లేటెంట్ వ్యూ అనలిటిక్స్ లిమిటెడ్ (19.79%), అజంత సోయా (19.62%) లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications