స్టాక్ మార్కెట్‌పై రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఏమన్నారంటే
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మార్కెట్ జోరు పైన బుల్లిష్‌గా ఉన్నారు. సెన్సెక్స్ రెండు రోజుల్లోనే 1100 పాయింట్లకు పైగా లాభపడింది. దీంతో మార్కెట్లు కరెక్షన్‌కు గురవుతాయా అనే ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల పరిణామాలు, చైనా ఎవర్ గ్రాండ్ ప్రకటన, వ్యాక్సినేషన్ వేగవంతం వంటి అంశాలు ఊతమిచ్చాయి. మార్కెట్ భవిష్యత్తుపై నిపుణులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇండియా టుడే గ్రూప్ గ్లోబల్ బిజినెస్ ఎడిటర్ ఉదయాన్ ముఖర్జీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మార్కెట్ జోరు పైన ఆయన మాట్లాడారు. సెన్సెక్స్ 60,000 మార్కుకు చేరుకోవడం సంతోషకరమని, ఇది ఆనందకరమైన రోజు అని, మనం మార్కెట్లో సరికొత్త గరిష్టాలను చూస్తున్నామని, నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు 60,000 కేవలం ఓ అంకె మాత్రమే అన్నారు.

పెట్టుబడుల్లో మార్పు
పెట్టుబడులకు సంబంధించి భారత్‌లో పెద్ద మార్పు కనిపిస్తోందని, చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి సాధనాలను మార్చుకున్నారని చెప్పారు. భారత్‌లో ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద బుల్ రన్స్‌లో ఇది ఒకటి అని తాను భావిస్తున్నానని చెప్పారు. 'హృదయం ఎప్పుడూ అంగీకరించదు. మార్కెట్ ఎప్పటికీ ఆగదు' అని వ్యాఖ్యానించారు. మార్కెట్లు ఇలాగే ముందు ముందుకు సాగుతాయని భావిస్తున్నానన్నారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ఫలితంగా దిద్దుబాటు సందేహాలు ఉన్నప్పటికీ, మార్కెట్ల దూకుడు ఆగదని అభిప్రాయపడ్డారు.

మార్కెట్లో విపరీతమైన స్పేస్
భారత్ క్రమంగా మారుతోందని, మార్పు కాలక్రమేణా మరింత ప్రాధాన్యతను ఇస్తోందని, మార్కెట్లో విపరీతమైన స్పేస్ ఉందన్నారు. కార్పోరేట్ రంగంలో సంస్కరణలు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఇవి దేశీయ స్టాక్ మార్కెట్లకు దోహదం చేశాయన్నారు. నరేంద్ర మోడీ సంస్కరణలు చేశారని, కష్టమైనప్పటికీ కఠినమైన సంస్కరణలు చేశారని, కానీ భారత్ ఇకనైనా మారకుంటే వారసత్వాన్ని మార్చలేమని, అందుకే ఈ సంస్కరణలు అన్నారు.

బుల్లిష్‌గానే
మార్కెట్లు బుల్లిష్‌గా ఉంటాయని తాను ధీమాగా ఉన్నానని, నేను కూడా దేశభక్తుడినేనని, కానీ తాను తన దేశభక్తిని, ఆర్థిక విలువలతో మిక్స్ చేయలేనని చెప్పారు. ఆకాశ ఎయిర్ లైన్స్ వెంచర్ గురించి కూడా స్పందించారు. భవిష్యత్తు ప్లాన్ గురించి తాను అప్పుడే బాహాటంగా మాట్లాడలేనని చెప్పారు. అయితే తన ఎయిర్ లైన్స్ బాగుంటుందని ధీమా వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications