ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా SBI Platinum Deposits స్కీంను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇండివిడ్యువల్స్, సీనియర్ సిటిజన్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ ప్రత్యేక ఆఫర్ కొంత కాలం మాత్రమే ఉంటుంది. ఈ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. సదరు డిపాజిట్స్ పైన అదనపు వడ్డీ రేటును కల్పిస్తున్నట్లు తెలిపింది. 'ప్లాటినమ్ డిపాజిట్ స్కీంతో భారత్ 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకోవాల్సిన సమయం ఇది.

ప్లాటినమ్ డిపాజిట్ పైన అదనపు వడ్డీ రేటు
SBI ప్లాటినం డిపాజిట్స్ పైన 0.15 శాతం అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. 75 రోజులు, 75 వారాలు, 75 నెలల గడువుతో ఈ ప్లాటినమ్ డిపాజిట్స్ స్వీకరిస్తారు. ఇండివిడ్యువల్స్ 75 రోజులు, 525 రోజులు, 2250 రోజుల గడువుతో డిపాజిట్స్ కూడా చేయవచ్చు.

వీటికి వర్తిస్తాయి.. వీటికి వర్తించవు
ఎస్బీఐ ప్లాటినమ్ డిపాజిట్ స్కీం కింద రూ.2 కోట్ల లోపు ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో టర్మ్ డిపాజిట్స్ అనుమతిస్తారు. ఎన్ఆర్ఈ డిపాజిట్స్ కేవలం 525 రోజులు, 2250 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కొత్త డిపాజిట్స్‌తో పాటు ఇప్పటికే చేసిన డిపాజిట్స్ రెన్యూవల్‌కు కూడా ఈ స్కీం రూల్స్ వర్తిస్తాయి. టర్మ్ లేదా స్పెషల్ టర్మ్ డిపాజిట్స్‌కు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది.
రికరింగ్ డిపాజిట్స్, ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్స్, యాన్యుటీ డిపాజిట్స్, MACAD డిపాజిట్స్, మల్టీ ఆప్షన్ డిపాజిట్స్, క్యాపిటల్ గెయిన్ స్కీమ్స్‌కు ఈ ఆఫర్లు వర్తించవు.

వడ్డీ రేటు ఎలా ఉంది?
ప్రస్తుతం ఎస్బీఐ ప్లాటినమ్ డిపాజిట్స్ పైన ఇండివిడ్యువల్స్‌కు 3.90 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ స్పెషల్ స్కీం కింద 3.95 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.525 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన ప్రస్తుతం 5 శాతం వడ్డీ రేటు ఉండగా, ఈ ప్రత్యేక స్కీంలో 5.10 శాతం వడ్డీ చెల్లిస్తారు. 2250 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన 5.40 శాతం వడ్డీ రేటు ఉండగా, ఎస్బీఐ స్పెషల్ డిపాజిట్ స్కీం కింద 5.55 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.
ఇక, సీనియర్ సిటిజన్స్‌కు 75 రోజుల కాలపరిమితిపై టర్మ్ డిపాజిట్ మీద 4.40 శాతం వడ్డీ రేటు ఉండగా, 4.45 శాతానికి, 525 రోజుల కాలపరిమితిపై 5.60 శాతానికి పెంచారు. 2250 రోజుల కాలపరిమితిపై అదనపు వడ్డీ రేటు లేదు. డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లు నెలవారీగా, త్రైమాసికం ప్రాతిపదికన చెల్లిస్తారు. మెచ్యూర్ అయిన తర్వాత ఈ డిపాజిట్ మొత్తం చెల్లిస్తారు.
ఎస్బీఐ ఇటీవల వివిధ ఆఫర్లు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. రక్షాబంధన్ ప్రత్యేక ఆఫర్ తీసుకు వచ్చింది.
భారత 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని SBI వివిధ రిటైల్ రుణాల పైన ప్రాసెసింగ్ ఫీజును ఇటీవల రద్దు చేసింది. దీంతో పాటు వడ్డీ రేట్లను తగ్గించింది. ఇటీవల హోమ్ లోన్స్ పైన పరిమిత కాలపు ఆఫర్ కింద 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. తాజాగా వాహనాలు, బంగారం రుణాలపై రిటైల్ కస్టమర్లకు ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications