SBI హోమ్ లోన్ తీసుకున్నవారికి షాక్.. EBLR, RLLR, MCLR రేట్లలో మార్పులు..ఈఎమ్ఐ భారం పెంచే కొత్త రేట్లు ఇవే..
SBI Loan Interest Rates Hiked: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన రుణగ్రహీతలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR) తో పాటు, ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత EBLR, RLLR వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. సవరించిన ఈ నూతన వడ్డీ రేట్లు అక్టోబర్ 15, 2026 నుండి తక్షణమే అమల్లోకి వచ్చాయని బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఈ సవరణల ప్రకారం రెపో రేటుతో నేరుగా అనుసంధానించబడిన ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రేటు (EBLR) 7.90% నుండి 8.15% (+ CRP + BSP) కి పెరిగింది. అలాగే రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) కూడా 7.50% నుండి 7.75% (+ CRP)కి చేరుకుంది.

సాధారణంగా బ్యాంకులు జారీ చేసే మెజారిటీ హోమ్ లోన్లు, వెహికల్ లోన్లు ఈ బెంచ్మార్క్ల ఆధారంగానే పనిచేస్తాయి. కాబట్టి ఫ్లోటింగ్ రేటు ఆధారంగా రుణాలు పొందిన ఖాతాదారులకు నెలవారీ వాయిదా (EMI) మొత్తం పెరగడం గానీ.. లేదా రుణ చెల్లింపు కాలపరిమితి (Tenure) విస్తరించడం గానీ జరుగుతుంది.
ఇక అంతర్గత బెంచ్మార్క్ అయిన MCLR విషయానికి వస్తే.. ఎస్బిఐ 3 నెలల కాలపరిమితి నుండి 3 సంవత్సరాల కాలపరిమితి కలిగిన రుణాలపై రేట్లను 15 బేసిస్ పాయింట్లు (0.15%) పెంచింది. ఓవర్నైట్ మరియు ఒక నెల కాలపరిమితి రేట్లను మాత్రం 7.85% వద్ద మార్పు లేకుండా ఉంచింది.
3 నెలల MCLR 8.25% నుండి 8.40% కి చేరింది.
6 నెలల MCLR 8.60% నుండి 8.75% కి పెరిగింది.
1 సంవత్సరం MCLR (అత్యధిక రుణాలకు ప్రామాణికం) 8.70% నుండి 8.85% కి పెరిగింది.
2 సంవత్సరాల MCLR 8.75% నుండి 8.90% కి, 3 సంవత్సరాల MCLR 8.80% నుండి 8.95% కి ఎగబాకాయి.
అయితే డిపాజిటర్లకు ఎస్బిఐ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. సాధారణ పౌరులకు ఎఫ్డిలపై 3.05% నుండి 6.60% వరకు, సీనియర్ సిటిజన్లకు 3.55% నుండి 7.10% వరకు వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.
ఆర్బీఐ రెపో రేటును పెంచిన వెంటనే ఎస్బిఐ ఈ నిర్ణయం తీసుకోవడంతో.. త్వరలోనే ఇతర ప్రైవేట్, ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకులు కూడా తమ రుణ రేట్లను పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పండుగ సీజన్లో ఇళ్ల కొనుగోళ్లు, వాహనాల కొనుగోలు ప్లాన్ చేసుకుంటున్న మధ్యతరగతి ప్రజలకు ఈ వడ్డీ రేట్ల పెంపుదనంతో ఆర్థిక భారం మరింత పెరగనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
