Loan Rates: గుడ్‌న్యూస్.. రుణ వడ్డీరేట్లను తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పూర్తి వివరాలు..
SBI Cut Loan Rates: ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశంలో అధిక వడ్డీ రేట్లకు కాలం చెల్లుతోందని తెలుస్తోంది. గడచిన నెలలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత భారతీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ రేట్లను తగ్గించవచ్చని భావించారు. అయితే అధిక స్థాయిల్లో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ అనిశ్చితులతో రేట్లలో మార్పులు ఉండబోవనే ప్రకటన వచ్చింది. అయితే మరో పక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం తన రుణ వడ్డీరేట్ల తగ్గింపును ప్రారంభించటం శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 అక్టోబర్ 15 - నవంబర్ 15 వరకు రుణాలపై తాజా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్(MCLR) రేటును ప్రకటించింది. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను ఒక నెల కాలానికి 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో ఇతర రేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపింది. తాజాగా సవరించిన MCLR అక్టోబర్ 15, 2024 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో షార్ట్ టర్మ్ రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

MCLR-ఆధారిత రేట్లు 8.20% నుండి 9.1% పరిధిలోకి వచ్చేలా సర్దుబాటు చేయబడ్డాయి. ఓవర్ నైట్ MCLR 8.20% వద్ద ఉంది. అయితే ఒక నెల రేటు 8.45% నుంచి 8.20%కి అంటే 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఇదే క్రమంలో మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది, రెండేళ్ల కాలానికి ఎంసీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా ఎస్బీఐ స్థిరంగా కొనసాగించింది. వాస్తవానికి రిజర్వు బ్యాంక్ ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో రెపో రేటును 6.5 శాతంగా కొనసాగించటంతో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్ ఈఎంఐలలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఈ క్రమంలో సెంట్రల్ బ్యాంక్ తన వైఖరిని తటస్థానికి మార్చింది. జూన్ 2019 తర్వాత వైఖరి మార్చుకోవడం ఇదే తొలిసారి కావటంతో త్వరలోనే వడ్డీ రేట్ల తగ్గింపులు ఉంటాయని రుణగ్రహీతలు భావిస్తున్నారు.
బ్యాంకు అందించే అతి తక్కువ రుణ రేటును మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR) అంటారు. ఇదే క్రమంలో బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు సెప్టెంబర్ 15, 2024 నుంచి అమలులోకి వచ్చేలా సంవత్సరానికి 15.15%కి సవరించబడింది. ఇక హోమ్ లోన్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు 9.15% వద్ద ఉంచింది. ఇదే క్రమంలో స్టేట్ బ్యాంక్ తన వ్యాపారాన్ని మరింత వేగంగా విస్తరించాలని చూస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 600 బ్యాంక్ శాఖలను తెరవాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఎస్బీఐ 22,542 బ్రాంచీలను కలిగి ఉంది. అలాగే 65,000 ఏటీఎంలు, 85,000 బ్యాంక్ కరస్పాండెంట్ల ద్వారా తన వినియోగదారులకు సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది కస్టమర్లకు సేవలను అదిస్తోంది.


Click it and Unblock the Notifications