ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లను నాలుగు యాప్స్ వినియోగించడం గురించి హెచ్చరించింది. తాము సూచించిన నాలుగు యాప్స్‌ను కస్టమర్లు తమ తమ మొబైల్ ఫోన్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవద్దని సూచించింది. ఈ యాప్స్‌ను డౌన్ లోడ్ చేయడం వల్ల గత నాలుగు నెలల కాలంలో 150 మంది ఎస్బీఐ కస్టమర్లకు రూ.70 లక్షలకు పైగా నష్టపోయినట్లు ఎస్బీఐ తెలిపినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ యాప్స్ ద్వారా ఫ్రాడ్‌స్టర్స్ మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ యాప్స్ డౌన్ లోడ్స్ వల్ల ఇలాంటి కేసుల సంఖ్య దేశంలో పెరుగుతున్నందున కస్టమర్లు ఆ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దని హెచ్చరించింది.
ఈ మేరకు ఆ యాప్స్‌ను కూడా పేర్కొంది. ఎనీడేస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూయర్, మింగిల్ వ్యూ యాప్స్‌ను డౌన్ లోడ్ చేయవద్దని పేర్కొంది. అలాగే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) యాప్‌ను వినియోగిస్తున్న సమయంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ లేదా క్యూఆర్ కోడ్‌ను యాక్సెప్ట్ చేయవద్దని సూచించింది.

హెల్ప్ లైన్ లేదా కస్టమర్ కేర్ నెంబర్స్ కోసం సెర్చ్ చేసే సమయంలో గుర్తు తెలియని వెబ్ సైట్స్‌ను ఉపయోగించవద్దని కూడా ఎస్బీఐ తన కస్టమర్లకు సూచించింది. ఎస్బీఐ పేరుతో పలు నకిలీ వెబ్ సైట్స్ రన్ అవుతున్నాయని, కాబట్టి వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కాబట్టి కస్టమర్ కేర్ లేదా హెల్ప్ లైన్ నెంబర్ల కోసం వెతికినప్పుడు అలాంటి నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది.
సమస్య ఏదైనా పరిష్కారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని, వాడే వెబ్‌సైట్ సరైనదే అని నిర్ధారించుకున్న తర్వాతే మీ వివరాలు తెలియజేయాలని సూచించింది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పూర్తయ్యాక వినియోగదారుకి ఒక ఎస్సెమ్మెస్ వస్తుందని, ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ వాళ్లు నిర్వహించకుంటే వెంటనే ఆ ఎస్సెమ్మెస్‌లోని నెంబర్‌కు సందేశం పంపించాలని తెలిపింది. మోసం జరిగినట్లు గుర్తిస్తే కస్టమర్ కేర్ నెంబర్స్ 1800111109, 9449112211, 08026599990 కాల్ చేయాలని తెలిపింది.


Click it and Unblock the Notifications