అక్టోబర్ 1 నుంచి క్యాష్ విత్‌డ్రాపై కొత్త ఛార్జీలు.. SBI ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాదారుల కోసం నగదు ఉపసంహరణ నిబంధనలలో గణనీయమైన మార్పులు చేసింది. బ్యాంకు శాఖల (Bank Branches) ద్వారా నిర్వహించే నగదు ఉపసంహరణలపై ఎస్‌బిఐ కొత్త సేవా ఛార్జీలను ప్రవేశపెడుతోంది. ఇది సాధారణ వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపనుంది. బ్యాంకు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. మీరు ఎస్‌బిఐ బేసిక్ సేవింగ్స్ ఖాతాను కలిగి ఉన్నట్లయితే, సర్వీస్ ఛార్జీల భారం పడకుండా ఉండటానికి ఈ కొత్త మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఎస్‌బిఐ విడుదల చేసిన కొత్త ఛార్జీల షెడ్యూల్ ప్రకారం.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాల (ప్రొడక్ట్ కోడ్: 1011-1701) కోసం బ్యాంకు శాఖల నుండి నిర్వహించే నగదు ఉపసంహరణలు ఇకపై నెలకు నాలుగు లావాదేవీల వరకు మాత్రమే పూర్తిగా ఉచితంగా ఉంటాయి. అయితే నెలకు నాలుగు సార్ల ఈ అనుమతించబడిన పరిమితిని మించి చేసే ప్రతి ఉపసంహరణకు, ప్రతి లావాదేవీకి రూ. 15 ఛార్జీతో పాటు వస్తు సేవల పన్ను (GST) అదనంగా వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ఖాతాదారుడు ఒకే నెలలో ఆరు సార్లు నగదు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకు శాఖను సందర్శిస్తే, మొదటి నాలుగు లావాదేవీలు ఉచితంగానే పూర్తవుతాయి. కానీ, ఐదవ మరియు ఆరవ విత్‌డ్రాయల్స్‌కు గాను సదరు కస్టమర్ ప్రతి లావాదేవీకి రూ. 15 తో పాటు జీఎస్టీ అదనపు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

అసలు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతా అంటే ఏమిటంటే.. ఇది ప్రధానంగా ప్రాథమిక బ్యాంకింగ్ సౌకర్యాలు అవసరమయ్యే సమాజంలోని అల్పదాయ వర్గాలు, సాధారణ ప్రజల కోసం రూపొందించబడింది. ఈ ఖాతాలో ఎటువంటి కనీస నిల్వ (Zero Balance) నిర్వహించాల్సిన అవసరం లేదు. ప్రాథమిక డిపాజిట్లు,విత్‌డ్రాయల్ సౌకర్యాలు ఉచితంగా అందించబడినప్పటికీ, బ్యాంకు నిర్వహణ ఖర్చులు, బ్రాంచ్‌లలో రద్దీని తగ్గించే ఉద్దేశంతో ఇప్పుడు ఉచిత బ్రాంచ్ లావాదేవీల సంఖ్యపై పరిమితులను విధించింది.
ఈ కొత్త నిబంధనల వల్ల నెలకు నాలుగు సార్ల కంటే ఎక్కువగా నగదు విత్‌డ్రా చేసుకోవడానికి నేరుగా ఎస్‌బిఐ శాఖలను సందర్శించే ఖాతాదారులు మాత్రమే నేరుగా ప్రభావితమవుతారు. ప్రతి చిన్న అవసరానికి డిపాజిట్ కౌంటర్ లేదా విత్‌డ్రాయల్ కౌంటర్ వద్ద క్యూలో నిలబడే వారికి ఇది అదనపు భారంగా మారనుంది. అయితే, డిజిటల్ బ్యాంకింగ్ మార్గాలైన యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్‌పై ఆధారపడే లేదా సాధారణంగా ఏటీఎంలను ఉపయోగించే కస్టమర్లపై దీని ప్రభావం అసలు ఉండదు.
ఈ అదనపు సర్వీస్ ఛార్జీల నుండి తప్పించుకోవడానికి వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొదటగా నెలవారీ నగదు ఉపసంహరణలను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. నాలుగు లావాదేవీల ఉచిత పరిమితి దాటకుండా ఉండేందుకు, నెల ప్రారంభంలోనే అవసరమైన మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడం శ్రేయస్కరం. రెండవది, రోజువారీ అవసరాలకు, దుకాణాల్లో కొనుగోళ్లకు నగదు చెల్లించే బదులు యూపీఐ, క్యూఆర్ కోడ్‌లు లేదా డెబిట్ కార్డుల వంటి డిజిటల్ చెల్లింపులను అలవాటు చేసుకోవాలి. చివరిగా చిన్న చిన్న మొత్తాల కోసం నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లే అలవాటును మానుకుని, సమీపంలోని ఏటీఎం లేదా మైక్రో ఏటీఎంలను ఉపయోగించడం వల్ల అనవసరమైన ఛార్జీల నుండి తప్పించుకోవచ్చు.


Click it and Unblock the Notifications
