జాయింట్ హోమ్‌లోన్ తీసుకుంటే ఎంతో ప్రయోజనం, పెద్ద మొత్తంలో ఆదా
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, హోమ్ లోన్స్ తీసుకుంటారు. ఇంటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మొత్తం అవుతుంది. దీనిని ఒకేసారి చెల్లించలేని పరిస్థితుల్లో చాలామంది హోమ్ లోన్ కోసం వెళ్తుంటారు. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, NBFC సంస్థలు ఆకర్షణీయ వడ్డీ రేట్లకు హోమ్ లోన్స్ అందిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల వరుసగా రెపో రేటు తగ్గిస్తోంది. దీంతో రుణాలు తీసుకుంటే కాస్త భారం కూడా తగ్గుతోంది.

జాయింట్ హోమ్ లోన్
హోమ్ లోన్ తీసుకునే సమయంలో ఆయా బ్యాంకులలో విచారించి, ఎందులో తక్కువ వడ్డీ తక్కువగా ఉంటే దానిని ప్రిఫర్ చేస్తారు. అలాగే ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని తమకు అనుకూలంగా ఉండే బ్యాంకును ఎంచుకుంటారు. అయితే హోమ్ లోన్ కేవలం ఒకరి పేరు పైన కంటే ఇద్దరు కలిసి తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ప్రయోజనాలు ఉంటాయి. ఇళ్లు కొనాలనుకునే వారికి, సింగిల్‌గా అప్రూవ్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్న వారు జాయింట్ హోమ్ లోన్ వైపు చూడవచ్చు. ఇలా చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి కొన్ని బెనిఫిట్స్ తెలుసుకోండి...

అధిక రుణం...
తక్కువ ఆదాయం, క్రెడిట్ స్కోర్ తక్కువ, డెబిట్ టు ఇన్‌కమ్ రేషియో ఎక్కువగా ఉండటం వంటి అంశాల వల్ల హోమ్ లోన్ అర్హతకు ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఇలాంటి సందర్భంలో జాయింట్ హోమ్ లోన్ ఎంచుకోవాలి. సహ దరఖాస్తుదారుని జోడిస్తే మీకు హోమ్ లోన్ అర్హత అవకాశాలు మెరుగుపడతాయి. ఇక్కడ సహ దరఖాస్తుదారుకు స్థిర ఆదాయం, మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే హోమ్ లోన్ సులభంగా మంజూరు అవుతుంది. ఇరువురి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నా మీరు అధిక రుణ మొత్తం పొందవచ్చు.

పన్ను ప్రయోజనాలు పొందవచ్చు
సెక్షన్ 80సీ, 24బీల కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. రుణ మొత్తంపై ఓ ఫైనాన్షియల్ ఇయర్లో రూ.1.5 లక్షల వరకు, వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. రుణ గ్రహీతలు వీటిని విడిగా క్లెయిమ్ చేయవచ్చు. జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే ఒక్కొక్కరు రూ.3.5 లక్షల చొప్పున మొత్తం రూ.7 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.

కో అప్లికెంట్ మహిళ అయితే వడ్డీ రేట్లు కాస్త తక్కువ
జాయింట్ హోమ్ లోన్‌లో మహిళ సహ దరఖాస్తుదారుగా ఉంటే వడ్డీ రేట్లపై రాయితీ కూడా ఉంటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మహిళలకు సాధారణ వడ్డీ రేట్ల కంటే కాస్త తక్కువగా ఇస్తాయి. పురుషులతో పోలిస్తే వీరికి 0.05 శాతం లేదా 5 బేసిస్ పాయింట్లు తక్కువ. ఇక్కడ స్త్రీ సహ యజమాని, సహ దరఖాస్తుదారుగా ఉండాలి.

మహిళలకు స్టాంప్ డ్యూటీ ఛార్జీలు తక్కువ
ప్రాపర్టీని మహిళ పేరుపై లేదా సహ యజమానిగా పేర్కొంటే స్టాంప్ డ్యూటీ ఛార్జీలు తగ్గించుకోవచ్చు. స్టాంప్ డ్యూటీ ఛార్జీలు రాష్ట్రాన్ని బట్టి మారినప్పటికీ మహిళలకు ఒక శాతం నుంచి రెండు శాతం తక్కువ ఉంటుంది.


Click it and Unblock the Notifications