రూ.10 వేలు దాటితే వెంటనే డబ్బులు వెళ్లవా.. గంట పాటు వెయిట్ చేయాల్సిందేనా.. RBI కొత్త ప్రతిపాదన..
RBI's New Digital Payment Proposal: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలకమైన.. వినూత్నమైన భద్రతా చర్యను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. రూ. 10 వేల కంటే ఎక్కువ విలువైన ఆన్‌లైన్ నగదు బదిలీ లావాదేవీలకు 'ఒక గంట నిరీక్షణ సమయం' (Cooling-off Period) ప్రవేశపెట్టాలని కేంద్ర బ్యాంకు యోచిస్తోంది.
సామాన్య ప్రజలు రోజువారీ అవసరాల కోసం చేసే చాలా వరకు డిజిటల్ లావాదేవీలు రూ. 10 వేల లోపే ఉంటున్నందున.. సాధారణ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మోసాలను నిరోధించడానికి ఇదే సరైన పరిమితి అని ఆర్‌బిఐ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అయితే ఈ ప్రతిపాదిత ఒక గంట ఆలస్య నిబంధన కేవలం వ్యక్తి నుండి వ్యక్తికి జరిగే (Peer-to-Peer లేదా P2P) లావాదేవీలకు మాత్రమే వర్తించే అవకాశం ఉంది. వ్యాపార సంస్థలు లేదా మర్చంట్ పేమెంట్లకు దీని నుండి మినహాయింపు ఉండవచ్చు. అంతేకాకుండా, P2P లావాదేవీలలో కూడా వినియోగదారులకు వెసులుబాటు కల్పిస్తూ 'వైట్‌లిస్టింగ్' (Whitelisting) సదుపాయాన్ని అనుమతించవచ్చని సమాచారం.
అంటే వినియోగదారులు ముందుగానే విశ్వసనీయమైన వ్యక్తులు లేదా కుటుంబ సభ్యులను ఆమోదిత లబ్ధిదారులుగా (Approved Beneficiaries) జాబితాలో చేర్చుకుంటే, వారికి పంపే నగదుకు ఈ ఒక గంట నిరీక్షణ కాలం నుండి మినహాయింపు లభిస్తుంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో తెలిసిన వారికి డబ్బు పంపడంలో ఎలాంటి జాప్యం జరగకుండా ఉంటుంది.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రజలు కష్టార్జితాన్ని కోల్పోతున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మార్చిలో డిజిటల్ మోసాల నివారణ చర్యలపై ఆర్‌బిఐ ఒక సమగ్ర చర్చా పత్రాన్ని (Discussion Paper) విడుదల చేసింది. వినియోగదారులను భయపెట్టి లేదా వంచించి మోసపూరిత ఖాతాలకు డబ్బు బదిలీ చేయించే 'డిజిటల్ అరెస్ట్' వంటి సైబర్ నేరాలను అడ్డుకోవడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం.
లావాదేవీ పూర్తయ్యేలోపు ఒక గంట సమయం ఉండటం వల్ల, తాము మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే అప్రమత్తమై ఆ బదిలీని నిలిపివేసే అవకాశం లభిస్తుంది. అలాగే బ్యాంకులు కూడా అనుమానాస్పద ఖాతాలకు వెళ్తున్న నిధులను గుర్తించి అడ్డుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది.
కాగా ఆర్‌బిఐ విడుదల చేసిన ముసాయిదా సర్క్యులర్‌పై బ్యాంకింగ్ రంగ నిపుణులు, చెల్లింపుల సంస్థలు, ఇతర వాటాదారుల నుండి వందలాది స్పందనలు, సూచనలు అందాయి. ఆయా వర్గాల నుండి వచ్చిన అభిప్రాయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. ఈ ఒక గంట నిరీక్షణ నిబంధన యొక్క తుది స్వరూపం మరియు అమలు విధివిధానాలపై ఆర్‌బిఐ త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే డిజిటల్ లావాదేవీల భద్రత మరింత పటిష్టం కానుంది.


Click it and Unblock the Notifications
