RBI News: బ్యాంకుల లోన్ మోసాన్ని గుర్తించిన ఆర్బీఐ.. మానుకోవాలని హెచ్చరిక..
Bank Loan: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను సజావుగా సాగేలా నిర్వహించేందుకు ఆర్బీఐ ఇటీవల వరుస చర్యలు చేపడుతోంది. చాలా సమయాన్ని కస్టమర్లను సదరు ఫైనాన్స్ సంస్థలు మోసం చేయకుండా కాపాడేందుకు అవసరమైన వ్యవస్థాగతమైన మార్పులకు శ్రీకారం చుడుతోంది.
తాజాగా సోమవారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని బ్యాంకులతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు కీలక సూచన చేసింది. ఫైనాన్స్ వ్యాపారంలో కంపెనీలు పాటిస్తున్న కొన్ని చర్యలను మార్చుకోవాలని సూచించింది. రుణాల విషయంలో వడ్డీతో పాటు ఇతర ఛార్జీలను రుణగ్రహీతలకు వర్తింపజేసేటప్పుడు కొన్ని రుణ విధానాలను సమీక్షించాలని ఆదేశించింది.

రుణాల విషయంలో న్యాయబద్ధత, పారదర్శకత కోసం తాజాగా సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నిస్తోంది. దేశంలోని చాలా సంస్థలు వడ్డీ వసూలు విషయంలో అన్యాయకరమైన పద్ధతులను పాటించటం రుణగ్రహీతలకు ఇబ్బందులను కలిగిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ కనుగొంది. కొన్ని రుణ సంస్థలు కస్టమర్‌కు నిధులను అసలు పంపిణీ చేసిన తేదీకి బదులుగా.. రుణం మంజూరు చేసిన తేదీ లేదా రుణ ఒప్పందాన్ని అమలు చేసిన తేదీ నుంచి వడ్డీని వసూలు చేస్తున్నారని ఆర్బీఐ గుర్తించింది.
అలాగే చెక్కు ద్వారా పంపిణీ చేయబడిన రుణాల విషయంలో కొంతమంది రుణదాతలు చెక్కు జారీ చేసిన తేదీ నుంచి వడ్డీని వసూలు చేస్తున్నారని గుర్తించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఈ క్రమంలో సదరు సంస్థలు చాలా రోజుల తరువాత చెక్కును కస్టమర్‌కు అందజేస్తున్నట్లు గుర్తించింది.
ఆర్బీఐ తాజా మార్గదర్శకాలు సోమవారం నుంచి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తుంది. అయితే చెల్లింపుల బ్యాంకులను దీని వర్తింపు నుంచి మినహాయించింది. ఈ రూల్స్ అన్ని అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు కూడా వర్తిస్తాయని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications