లోన్ తీసుకున్నవారికి బిగ్ అలర్ట్.. డిసెంబర్‌లో మళ్లీ వడ్డీ రేట్ల పెంపు.. నోమురా కీలక అంచనా..
RBI Repo Rate: దేశంలో మళ్లీ పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రమాదాలు, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మరోసారి వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే డిసెంబర్ ద్రవ్య విధాన సమీక్ష (MPC) సమావేశంలో ఆర్‌బీఐ కీలక పాలసీ.. రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు (bps) పెంచవచ్చని ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ 'నోమురా' (Nomura) అంచనా వేసింది.
ఆ పెంపు తర్వాత ఆర్‌బీఐ తన విధాన నిర్ణయాల్లో సుదీర్ఘ విరామాన్ని (Pause) ప్రకటించవచ్చని.. రాబోయే 2027 ఫిబ్రవరి సమావేశంలో యథాతథ స్థితి కొనసాగవచ్చని పేర్కొంది. ఇటీవల విడుదలైన ఆర్‌బీఐ అక్టోబర్ ఎంపీసీ సమావేశపు నివేదిక (MPC Minutes) విశ్లేషిస్తే.. ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలకు రూపాయి మారకం విలువ కంటే ప్రధానంగా వృద్ధి-ద్రవ్యోల్బణ గతిశీలతలే (Growth-Inflation Dynamics) ప్రధానమైన శక్తులుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

తన అక్టోబర్ సమావేశంలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తన విధాన వైఖరిని (Policy Stance) 'న్యూట్రల్' నుండి 'క్యాలిబ్రేటెడ్ టైటనింగ్'కు మార్చింది. దేశంలో బలమైన ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ, పెరిగిన ముడిసరుకుల వ్యయాలు (Raw Material Costs) చిల్లర ధరలపైకి బదిలీ కావడం ప్రారంభమవ్వడంతో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. డిప్యూటీ గవర్నర్ గుప్తా, ఆర్‌బీఐ సభ్యుడు ఇంద్రనీల్ భట్టాచార్య ద్రవ్యోల్బణ అంచనాలను అదుపులోకి తెచ్చేందుకు ముందస్తు రేటు పెంపు అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్ రేట్ల పెంపు విషయమై ఎంపీసీలోని అంతర్గత, బాహ్య సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆర్‌బీఐ సభ్యులు కఠినమైన విధానాలకు మొగ్గు చూపుతుండగా, బాహ్య సభ్యులు మాత్రం తీవ్రమైన కఠినతరం చేయడం వల్ల వృద్ధిపై పడే ప్రతికూల ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బాహ్య సభ్యుడు రామ్ సింగ్ ఈ వైఖరి మార్పును వ్యతిరేకిస్తూ.. భారీగా రేట్లు పెంచితే వడ్డీ-సున్నితత్వమున్న వినియోగదారుల వ్యయం మరియు ప్రైవేట్ మూలధన వ్యయం (Capex) తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు.
అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ మరియు వాణిజ్య పన్నుల అనిశ్చితులను పరిగణనలోకి తీసుకుని తటస్థ వైఖరికే నాగేష్ కుమార్ మద్దతు తెలిపారు. ద్రవ్యోల్బణ ప్రమాదాలు ఇంకా ఉన్నాయని, విదేశీ రుణ మూలధనాన్ని ఆకర్షించడానికి భారతదేశం మరియు జి7 (G7) దేశాల వడ్డీ రేట్ల మధ్య సరైన వ్యత్యాసాన్ని కొనసాగించడం చాలా ముఖ్యమని సౌగతా భట్టాచార్య పేర్కొన్నారు.
ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు కరెన్సీ రక్షణ కోసం వడ్డీ రేట్లను డిసెంబర్‌లో భారీగా పెంచుతారనే అంచనాలను పెంచినప్పటికీ.. ఎంపీసీ మినిట్స్ మాత్రం ప్రధానంగా ద్రవ్యోల్బణ లక్ష్యంపైనే దృష్టి సారించాయని నోమురా విశ్లేషించింది. మారకపు రేటును సమర్థించుకోవడానికి వడ్డీ రేట్లను ఒక అస్త్రంగా వాడటం మొరటు సాధనమవుతుంది, దీనివల్ల ఆర్థిక వృద్ధికి ఊహించని నష్టం వాటిల్లుతుందని నోమురా వ్యాఖ్యానించింది. అందువల్ల, వచ్చే డిసెంబర్‌లో 25 bps పెంపు ద్వారా రెపో రేటును 5.75%కి చేర్చి, ఆ తర్వాత సుదీర్ఘ కాలం రేట్లను మార్చకుండా ఆర్‌బీఐ స్థిరంగా ఉంచుతుందని బ్రోకరేజ్ సంస్థ నిశ్చిత అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications
