లోన్లు తీసుకున్నవారికి బిగ్ షాక్.. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెంచేందుకు రెడీ అవుతున్న RBI..
RBI Repo Rate Hike: రూపాయి మారకం విలువ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్లు దాటడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడం వంటి పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితుల నడుమ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ ద్వారా కీలకమైన వడ్డీ రేట్లను సవరించే దిశగా ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగే ఆర్‌బిఐ క్రెడిట్ పాలసీ సమీక్ష సమావేశం మార్కెట్ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 7, 2026 వరకు జరుగుతుంది. మూడో రోజైన అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు ఆఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వడ్డీ రేట్లపై కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బిఐ నిర్దేశిత 2 నుండి 6 శాతం పరిమితిలో ఉంచడానికి, అలాగే మార్కెట్‌లో ఉన్న అదనపు ద్రవ్య లభ్యతను తగ్గించడానికి ఆర్‌బిఐ కఠిన చర్యలు తీసుకునే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఆర్‌బిఐ ప్రస్తుతం తటస్థ విధాన వైఖరిని కొనసాగిస్తున్నప్పటికీ, రాబోయే సమావేశంలో రేట్ల పెంపు వైపు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.

ఒకవేళ ఆర్‌బిఐ తన రాబోయే ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25 శాతం మేర పెంచితే, అది 6.75 శాతానికి చేరుకుంటుంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే దాని ప్రభావం బ్యాంకింగ్ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా బాండ్ మార్కెట్లతో పాటు సాధారణ వినియోగదారుల ఆర్థిక స్థితిపై ప్రత్యక్షంగా పడుతుంది. వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతో 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ దిగుబడులు పెరిగి 7.38 శాతం నుండి 7.40 శాతం శ్రేణికి చేరుకునే అవకాశం ఉంది.
మరోవైపు గృహ, వాహన రుణాలు వంటి ఫ్లోటింగ్ రేటు ఆధారిత రుణాలపై బ్యాంకులు తమ వడ్డీ రేట్లను వెంటనే పెంచుతాయి. ఉదాహరణకు, 20 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్న 50 లక్షల రూపాయిల గృహ రుణంపై వడ్డీ రేటు 8.50 శాతం నుండి 8.75 శాతానికి పెరిగితే, రుణగ్రహీత ప్రతినెల చెల్లించాల్సిన ఇఎంఐ దాదాపు 795 రూపాయిలు అధికమవుతుంది. దీనివల్ల మొత్తం రుణ కాలపరిమితి ముగిసేసరికి చెల్లించే అదనపు వడ్డీ భారమే సుమారు 1.90 లక్షల రూపాయిల వరకు ఉంటుంది. ఒకవేళ ప్రతి నెల ఇఎంఐ భారం పెరగకూడదని భావిస్తే, బ్యాంకులు రుణ వ్యవధిని పొడిగిస్తాయి, దీనివలన దీర్ఘకాలంలో వడ్డీ భారం మరింత పెరుగుతుంది.
ఈ వడ్డీ రేట్ల పెంపు వల్ల ప్రతికూల ప్రభావాలే కాకుండా కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు పెంచడంతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు సేవింగ్స్ ఖాతాలపై ఇచ్చే వడ్డీ రేట్లను కూడా సవరిస్తాయి. దీనివల్ల సీనియర్ సిటిజన్లు, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక పొదుపు దారులకు మెరుగైన రాబడులు లభిస్తాయి. అలాగే ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు స్థిరపడే అవకాశం ఏర్పడుతుంది.
రాబోయే ఆర్‌బిఐ సమీక్ష సమావేశంలో గవర్నర్ మరియు ద్రవ్య విధాన కమిటీ సభ్యులు తీసుకునే నిర్ణయాలు దేశీయ వాణిజ్యం, రుణగ్రహీతల ప్రణాళికలు మరియు పొదుపు నిర్ణయాలపై కీలక ప్రభావం చూపనున్నాయి. ఒకవేళ రేట్లు పెరిగితే హోమ్ లోన్ ఖాతాదారులు అసలు మొత్తంలో కొంత పాక్షిక చెల్లింపు చేయడం ద్వారా ఇఎంఐ లేదా రుణ వ్యవధి పెరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవడం శ్రేయస్కరం.


Click it and Unblock the Notifications

