రుణం కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తే కుదరదు.. ఆర్‌బీఐ సంచలన మార్గదర్శకాలు..
మధ్యతరగతి ఇంట ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది లగ్జరీ కాదు, ఒక కనీస అవసరం. చేతిలో తగినంత డబ్బు లేకపోయినా, ఈజీ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో చాలామంది ఖరీదైన ఫోన్లను లోన్లపై కొనేస్తుంటారు. అయితే, ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చి ఒకట్రెండు ఈఎంఐలు ఆలస్యమైతే చాలు, ఫైనాన్స్ కంపెనీలు లేదా బ్యాంకులు సదరు మొబైల్ స్క్రీన్‌ను లాక్ చేయడం, లేదా ఫోన్‌ను పూర్తిగా బ్లాక్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
చేతిలో ఉన్న ఫోన్ మూలనపడితే ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో రుణగ్రహీతలు నానా అవస్థలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో, మొబైల్ లోన్లు తీసుకునే సామాన్యులకు భారీ ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం ఒక సంచలన ముసాయిదాను విడుదల చేసింది. లోన్ బాకీలు చెల్లించలేదనే నెపంతో కస్టమర్ల మొబైల్ ఫోన్లను పూర్తిగా బ్లాక్ చేయడం లేదా నిలిపివేయడం ఏమాత్రం కుదరదని బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది.

ఆర్‌బీఐ తన ముసాయిదా సవరణ ఆదేశాలలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కొన్ని కీలక సూచనలు చేసింది. ఒకవేళ కస్టమర్ మొబైల్ ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే, ఆ ఫోన్‌లోని కొన్ని ఫీచర్లను, అంటే కొన్ని యాప్స్ లేదా అదనపు సేవలను పరిమితం చేసే హక్కు బ్యాంకులకు ఉంటుంది. కానీ, ఫోన్‌ను అసలు వాడుకోనివ్వకుండా పూర్తిగా మృతప్రాయం చేయడం చట్టవిరుద్ధమని ఆర్‌బీఐ తేల్చిచెప్పింది. అయితే ఈ కొత్త నిబంధనలు కేవలం మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా తీసుకున్న రుణాలకు మాత్రమే వర్తిస్తాయని, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న అప్పులకు దీనికి ఎటువంటి సంబంధం లేదని కూడా వివరించింది.
రుణం వసూలు చేసే ప్రక్రియలో పారదర్శకత ఉండాలని ఆర్‌బీఐ బలంగా కోరుకుంటోంది. కొత్త నిబంధనల ప్రకారం మొబైల్ లోన్ బకాయి పడి 60 రోజులు దాటిన తర్వాతే బ్యాంకులు రుణగ్రహీతకు అధికారికంగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా, నోటీసు అందిన తర్వాత కూడా కస్టమర్ తన ఆర్థిక లోటును సరిదిద్దుకుని బాకీని చెల్లించడానికి బ్యాంకులు అదనంగా 21 రోజుల సమయాన్ని ఇవ్వాలి. అంతేకాని, ఒక ఈఎంఐ బౌన్స్ అవ్వగానే ఫోన్ ఆపేస్తామంటూ బెదిరించడానికి వీల్లేదు.
చాలా సందర్భాల్లో లోన్ యాప్‌లు లేదా ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్ల వ్యక్తిగత డేటాను, కాంటాక్ట్ లిస్ట్‌ను యాక్సెస్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఉదంతాలు వెలుగుచూశాయి. దీనిపై ఆర్‌బీఐ ఉక్కుపాదం మోపింది. రుణ వసూళ్ల పేరుతో కస్టమర్ సెల్‌ఫోన్ లో నిల్వ ఉన్న ఎటువంటి వ్యక్తిగత డేటాను సేకరించడానికి వీల్లేదని బ్యాంకులను ఖచ్చితంగా నిషేధించింది. మరోవైపు, రికవరీ ఏజెంట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ సమయ పాలనను విధించింది.
బ్యాంకు ఉద్యోగులు లేదా రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతను గానీ, దానికి హామీ ఇచ్చిన వ్యక్తిని గానీ కలవాలనుకుంటే కేవలం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే అనుమతి ఉంటుంది. అర్ధరాత్రి వేళల్లో ఫోన్లు చేయడం, ఇళ్లపైకి వెళ్లడం నిషిద్ధం. కస్టమర్లను లేదా వారి బంధువులను భయపెట్టడం, దుర్భాషలాడటం, సామాజికంగా అవమానించడం వంటి పనులు చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు తావుండకూడదని, కుటుంబ పరువుకు భంగం కలిగించరాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఆర్‌బీఐ ప్రతిపాదించిన ఈ విప్లవాత్మక రికవరీ నిబంధనలు ముసాయిదా రూపంలో ఉన్నాయి. వీటిపై దేశ ప్రజలు, నిపుణుల అభిప్రాయాలను ఆర్‌బీఐ ఆహ్వానిస్తోంది. ఈ నిబంధనలపై మీ ఫీడ్‌బ్యాక్‌ను లేదా సలహాలను మే 31 లోగా ఆర్‌బీఐకి సమర్పించవచ్చు. ఆ తర్వాతే ఇవి పూర్తిస్థాయి చట్టాలుగా అమల్లోకి వస్తాయి. ఏదేమైనా, ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మొబైల్ ఫైనాన్స్ కంపెనీల ఆగడాలకు పెద్ద బ్రేక్ పడినట్లేనని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications
