FD Rate Hike: డిపాజిట్ల వడ్డీ రేటు పెంచిన బ్యాంక్.. సీనియర్లకు @ 7.70%
Kotak Mahindra Bank: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ డిపాజిట్లపై తన వడ్డీ రేట్లను సవరించింది. ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంక్ కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచిన తరుణంలో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై..
బ్యాంక్ ప్రకటన ప్రకారం రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 7 రోజుల నుంచి 10 ఏళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల కోసం సాధారణ ప్రజలకు 2.75 శాతం నుంచి 6.20 శాతం వరకు రేట్లను అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి అత్యధికంగా 6.70 శాతం వడ్డీని అందించనుంది. 390 రోజుల నుంచి 2 ఏళ్ల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు ఇప్పుడు నాన్-సీనియర్ రెసిడెంట్‌లకు గరిష్ఠంగా 7.20% రాబడిని బ్యాంక్ అందిస్తోంది. ఇదే కాలానికి సీనియర్ సిటిజన్లు ఏకంగా 7.70 శాతం వడ్డీని పొందనున్నట్లు బ్యాంక్ తెలిపింది.

కోటక్ మహీంద్రా బ్యాంక్..
7- 14 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు 2.75% వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే 15-30 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.00% వడ్డీ రేటును అందిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ అందించే వడ్డీ రేట్లు ఇప్పుడు 31-45 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 3.25% వడ్డీని, 46-90 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 3.50% వడ్డీ ఆదాయాన్ని అందిస్తోంది.

మూడు నెలలకు పైన..
అలాగే బ్యాంక్ 91-120 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు ఇప్పుడు 4.00% వడ్డీని పొందుతాయి. అలాగే 121-179 రోజుల్లో మెచ్యూరిటీ కాలానికి 4.25% వడ్డీని బ్యాంక్ అందిస్తోంది. బ్యాంక్ 180 రోజుల నుంచి 363 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.00% వడ్డీ రేటును చెల్లించనుంది. ఇదే సమయంలో 364 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ 6.25% వడ్డీ రేటును అందిస్తోంది.

365 రోజులకు మించి..
కోటక్ మహీంద్రా బ్యాంక్ అందించే వడ్డీ రేట్లు ఇప్పుడు 365 రోజుల నుంచి 389 రోజుల వరకు ఉన్న డిపాజిట్లపై 7 శాతానికి చేరుకుంది. అలాగే 390 రోజుల నుంచి రెండేళ్ల లోపు కాలానికి చేసే డిపాజిట్లపై బ్యాంక్ 7.2 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. అలాగే బ్యాంక్ నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి చేసే డిపాజిట్లపై 6.20 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
ఉదయ్ కోటక్ అంచనా..
ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ప్రస్తుతం భారీ నష్టాల్లో ఉన్నాయని ఉదయ్ కోటక్ వెల్లడించారు. దీనికి తోడు అమెరికా ద్రవ్యోల్బణం కారణంగా మరింత వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. మరింత కాలం రేట్ల పెంపు కొనసాగుతుందని అందరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీని కారణంగా భారతదేశంలోనూ రిజర్వు బ్యాంక్ తన వడ్డీ రేట్ల పెంపును కొనసాగించవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications