వినియోగదారులకు RBI భారీ షాక్.. PhonePe, Paytm, Cred యాప్స్‌లో అద్దె చెల్లింపుల ఫీచర్ నిలిపివేత
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న సమయంలో, PhonePe, Paytm, Cred వంటి ప్రముఖ ఫిన్‌టెక్ యాప్‌లు వినియోగదారులకు ఒక ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తూ వస్తున్న సంగతి విదితమే. అదే రెంట్ ఫీచర్.. అంటే క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి యజమానికి అద్దె చెల్లించే అవకాశం. ఈ ఫీచర్ ప్రత్యేకించి మెట్రో నగరాల్లోని యువత, ఉద్యోగ వర్గానికి ఎంతగానో ఉపయోగపడేది. చాలామంది దీనిని తమ క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్లు సంపాదించడానికి లేదా తక్షణ లిక్విడిటీ అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించారు. అయితే, ఇప్పుడు ఈ సౌకర్యం అకస్మాత్తుగా నిలిచిపోవడంతో వినియోగదారులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
సెప్టెంబర్ 15న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పేమెంట్ అగ్రిగేటర్ (PA) మరియు పేమెంట్ గేట్‌వే (PG) మార్గదర్శకాలను మరింత కఠినతరం చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. పేమెంట్ అగ్రిగేటర్లు ప్రత్యక్ష ఒప్పంద సంబంధం లేని వ్యాపారులకు చెల్లింపు సౌకర్యం ఇవ్వకూడదు. వ్యాపారిగా పరిగణించబడే వ్యక్తులందరికీ KYC తప్పనిసరి. కస్టమర్ డ్యూ డిలిజెన్స్ (CDD) చేయడం, సెంట్రల్ KYC రిజిస్ట్రీలో రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి.

దీనివల్ల ఇంటి యజమానుల బ్యాంక్ ఖాతాలను కూడా KYC చెక్ చేయాల్సిన బాధ్యత ఫిన్‌టెక్ యాప్‌లపై పడింది. ఇది ఆచరణలో చాలా కష్టమైన ప్రక్రియ కావడంతో కంపెనీలు అద్దె చెల్లింపు సేవను నిలిపివేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. కాగా గత కొన్ని సంవత్సరాల్లో క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించే ట్రెండ్ విపరీతంగా పెరిగింది. చాలామంది తమ బ్యాంక్ ఖాతాలకు డబ్బు బదిలీ చేసుకునేందుకు రెంట్ పేమెంట్ ఫీచర్‌ను వినియోగించేవారు. దీనిని క్రెడిట్ కార్డు లిక్విడిటీ కోసం ఒక సులభ మార్గంగా భావించారు. అయితే, ఫిన్‌టెక్ యాప్‌లు దీనిపై భారీ సర్వీస్ ఫీజులు వసూలు చేస్తూ లాభాలు పొందేవి. ఇప్పుడు ఈ సౌకర్యం నిలిపివేయడం వల్ల ఫ్లెక్సిబుల్ ఫైనాన్షియల్ ఆప్షన్లు కోల్పోయిన వినియోగదారులు నిరాశ చెందుతున్నారు.
ఫిన్‌టెక్ యాప్‌లకే కాకుండా బ్యాంకులు కూడా కొత్త నియమాలతో ముందుకు వచ్చాయి. HDFC బ్యాంక్ ఫిన్‌టెక్ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డు అద్దె చెల్లింపులకు ప్రతి లావాదేవీకి 1 శాతం ఫీజు విధించింది.ICICI బ్యాంక్ & SBI కార్డ్ అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను పూర్తిగా నిలిపివేశాయి. అంటే వినియోగదారులు ఇకపై ఫీజులు చెల్లించాలి కానీ ఎటువంటి రివార్డ్ లాభాలు పొందలేరు. ఇది మరింత నిరుత్సాహపరిచే అంశంగా చెప్పుకోవచ్చు.
RBI తీసుకున్న ఈ నిర్ణయం ఫ్రాడ్ లావాదేవీలను అరికట్టడమే లక్ష్యంగా తీసుకువచ్చింది. అద్దె చెల్లింపుల రూపంలో అనధికారిక డబ్బు బదిలీలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాబట్టి భవిష్యత్తులో ఫిన్‌టెక్ కంపెనీలు కొత్త కాంప్లైయెన్స్ ఫ్రేమ్‌వర్క్ లో మార్పులు చేస్తే, ఈ సేవ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి, RBI కొత్త మార్గదర్శకాలు PhonePe, Paytm, Cred వంటి ఫిన్‌టెక్ యాప్‌ల వినియోగదారులపై తక్షణ ప్రభావం చూపించాయి. అద్దె చెల్లింపుల ఫీచర్ నిలిపివేయడం వల్ల డిజిటల్ ఫైనాన్స్ రంగంలో పారదర్శకత పెరుగుతుందని భావించినా, వినియోగదారులకు మాత్రం ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పాలి.


Click it and Unblock the Notifications