భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, ఈ స్టాక్స్ 10%కి పైగా లాభపడ్డాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (అక్టోబర్ 6, 2021) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు, మధ్యాహ్నం సమయానికి నష్టాల్లోకి వెళ్లాయి. మార్కెట్ నిన్నటికి భిన్నంగా నేడు ఆద్యంతం కొనసాగింది. నిన్న నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నానికి కోలుకొని, ఆ తర్వాత భారీ లాభాల్లో ముగిశాయి. నేడు లాభాల్లో ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం నష్టాల్లోకి వెళ్లి, చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి.
నిన్న సెన్సెక్స్ 445 పాయింట్ల లాభాల్లో ముగియగా, నేడు 555 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. గతవారం 1200 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలు, ఈ వారం మొదటి రెండు సెషన్‌లలో వెయ్యికి పైగా లాభపడిన సెన్సెక్స్, నేడు మాత్రం ఈవారం లాభపడిన సగం పతనమైంది.

అందుకే నష్టాల్లోకి...
ఐరోపా మార్కెట్ ప్రతికూల సంకేతాలతో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ కావడంతో దేశీయ సూచీల సెంటిమెంట్ దెబ్బతిన్నది. చమురు ధరలు పెరుగుతుండడం ఐరోపా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు, నేడు ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అయితే, కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఇప్పటి వరకు అవలంబించిన సర్దుబాటు ధోరణికి ఆర్బీఐ స్వస్తి పలకనుందనే సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో దేశీయ సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ భారీగా పతనమై రూ.75.02 వద్ద ఆరు నెలల కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
సెన్సెక్స్ నేడు ఉదయం 59,942.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,963.57 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,079.86 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,861.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,884.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,613.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 555.15(0.93) పాయింట్లు నష్టపోయి 59,189.73 పాయింట్ల వద్ద, నిఫ్టీ 176.30 (0.99) పాయింట్లు నష్టపోయి 17,646.00 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ONGC 2.72 శాతం, TATA Cons. Prod 2.40 శాతం, యూపీఎల్ 1.77 శాతం, బ్రిటానియా 1.45 శాతం, HDFC బ్యాంకు 1.22 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో SBI Life Insura 3.95 శాతం, Hindalco 3.92 శాతం, IndusInd Bank 3.14 శాతం, JSW Steel 2.96 శాతం, Tata Steel 2.81 శాతం నష్టపోయాయి.

10 శాతానికి పైగా లాభపడిన స్టాక్స్
బీఎస్ఈ సెనెస్క్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలో నేడు ఎక్కువ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. అయితే పలు స్టాక్స్ మాత్రం పది శాతం మేర లాభపడ్డాయి. అలా లాభపడిన స్టాక్స్‌లో కెమ్ బాండ్ కెమ్ (14.49%), కంఫోర్ట్ కామో(13.91%), పంచషీల్ ఆర్గ్ (12.67%), ఆస్టిన్ ఇంజినీరింగ్ (12.59%), బాస్(11.74%), సంఘ్వీ మూవర్స్(11.56%), వాక్సన్స్ ఆటోమొబైల్స్ (11.14%), ఆర్బిట్ ఎక్స్‌పోర్ట్స్ (10.96%), భాగ్యనగర్ ప్రాపర్టీ (10.67%), రామా పాస్పేట్స్ (10.0%) లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications