మార్కెట్లో ఒడిదొడుకులు.. మల్టీక్యాప్ వర్సెస్ ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది బెస్ట్?
భారత స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఒడిదొడుకులు (Market Volatility) ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేస్తున్నాయి. ఇలాంటి అస్థిరమైన వాతావరణంలో తమ పెట్టుబడులు సురక్షితంగా ఉంటూనే మంచి లాభాలు రావాలంటే ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) ఎంచుకోవాలనే సందిగ్ధత చాలామందిలో ఉంది. ముఖ్యంగా, మార్కెట్లోని లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ అనే మూడు విభాగాల్లోనూ ఇన్వెస్ట్ చేసే 'మల్టీక్యాప్', 'ఫ్లెక్సీక్యాప్' ఫండ్స్‌లో ఏది బెటర్ అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ రెండింటిలో ఏది ఎప్పుడు లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

అసలు మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ మధ్య తేడా ఏంటి?
ఈ రెండు కేటగిరీలు కూడా అన్ని రకాల మార్కెట్ క్యాపిటలైజేషన్లలో పెట్టుబడులు పెట్టినప్పటికీ, వీటి అలోకేషన్ రూల్స్ వేర్వేరుగా ఉంటాయి..
- మల్టీక్యాప్ ఫండ్స్ (Multicap Funds): సెబీ (SEBI) నిబంధనల ప్రకారం.. ఈ ఫండ్స్ తమ మొత్తం పెట్టుబడిలో ఖచ్చితంగా లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్‌లలో కనీసం 25% చొప్పున (మొత్తం 75%) నిధులను కేటాయించాలి. అంటే మార్కెట్ ఎలా ఉన్నా అన్ని విభాగాల్లో సమానంగా డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది.
- ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ (Flexicap Funds): వీటికి ఎలాంటి ముందస్తు నిబంధనలు లేవు. ఫండ్ మేనేజర్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ కండిషన్స్ బట్టి స్మాల్‌క్యాప్స్ తగ్గించి, లార్జ్ క్యాప్స్ పెంచుకోవచ్చు లేదా వైస్-వెర్సా మార్చుకోవచ్చు.
నిపుణులు ఏమంటున్నారు? ఏది ఎప్పుడు సేఫ్?
ఆనంద్ రాథీ వెల్త్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్మీత్ సింగ్ అభిప్రాయం ప్రకారం.. మార్కెట్ పడిపోతున్నప్పుడు లేదా భారీ ఒడిదొడుకులు ఉన్నప్పుడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ డౌన్‌సైడ్ ప్రొటెక్షన్ (నష్టాల నుండి రక్షణ) ను బాగా ఇవ్వగలవు. ఎందుకంటే, సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ 50 నుండి 60 శాతం పెట్టుబడులను లార్జ్-క్యాప్ కంపెనీలలోనే ఉంచుతాయి, ఇవి మార్కెట్ పతనాన్ని తట్టుకోగలవు. ఒకవేళ మార్కెట్ క్రాష్ అయితే, మల్టీక్యాప్ ఫండ్స్ ఖచ్చితంగా స్మాల్/మిడ్ క్యాప్స్ లో 25% ఉంచాలి కాబట్టి వాటిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మరోవైపు, గ్రో మ్యూచువల్ ఫండ్ (Groww Mutual Fund) ఈక్విటీ హెడ్ అనుపమ్ తివారీ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు , మొదటిసారి మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) లోకి వచ్చే వారికి మల్టీక్యాప్ ఫండ్స్ ఒక అద్భుతమైన 'కోర్ అలొకేషన్' గా ఉపయోగపడతాయని చెప్పారు. ఇవి ఒకే ప్రొడక్ట్ ద్వారా దేశంలోని అగ్రగామి కంపెనీలతో పాటు, భవిష్యత్తులో ఎదిగే చిన్న కంపెనీలలోనూ క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తాయి.
స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి?
టాటా మ్యూచువల్ ఫండ్ తాజా నివేదిక (ఏప్రిల్ 2026 ముగింపు నాటికి) ప్రకారం.. నిఫ్టీ 50 తో పోలిస్తే నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 వాల్యుయేషన్ ప్రీమియం గత నెలలోని 12% నుండి ఏకంగా 18% కి పెరిగింది. స్మాల్‌క్యాప్స్ యొక్క 1-ఇయర్ ఫార్వర్డ్ P/E రేషియో 22.6 గా ఉంది, ఇది దాని దీర్ఘకాలిక సగటు (16.9x) కంటే చాలా ఎక్కువ. అలాగే మిడ్ క్యాప్ వాల్యుయేషన్ ప్రీమియం కూడా 50% కి చేరింది.
దీని అర్థం ప్రస్తుతం లార్జ్-క్యాప్ షేర్లు.. మిడ్, స్మాల్ క్యాప్స్ కంటే మెరుగైన రిస్క్-రివార్డ్ రేషియోను కలిగి ఉండి, ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఐదేళ్ల సగటు కంటే తక్కువ వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతున్న మంచి ఫండమెంటల్స్ ఉన్న షేర్లను ఎంచుకోవడానికి మల్టీక్యాప్ మేనేజర్లకు మంచి అవకాశం దొరుకుతుందని అనుపమ్ తివారీ పేర్కొన్నారు.
SIP ఇన్వెస్టర్లకు ఏది బెస్ట్? ఐడియల్ పోర్ట్‌ఫోలియో ఏంటి?
గత 1 నుండి 5 ఏళ్ల కాలంలో గ్రో మల్టీక్యాప్ ఫండ్ సుమారు 10.78% రిటర్న్స్ ఇవ్వగా, క్వాంట్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ 9.96% వరకు రిటర్న్స్ ఇచ్చాయి. దీర్ఘకాలంలో (3-5 ఏళ్లు) రెండు కేటగిరీలు కూడా 17% నుండి 20% పైగా అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఇన్వెస్ట్ చేసే వారికి కేవలం ఒక్క కేటగిరీ మాత్రమే ఎప్పటికీ బెస్ట్ అని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఓవరాల్ పోర్ట్‌ఫోలియో స్థాయిలో ఇన్వెస్టర్లు కింది విధంగా అలోకేషన్ మెయింటైన్ చేయడం ద్వారా మార్కెట్ ఒడిదొడుకులను సులభంగా అధిగమించవచ్చు
లార్జ్ క్యాప్ (Large Cap) 50% నుండి 55%, మిడ్ క్యాప్ (Mid Cap)20% నుండి 25%, స్మాల్ క్యాప్ (Small Cap) మిగిలిన బ్యాలెన్స్ మొత్తం మీ పోర్ట్‌ఫోలియోలో మల్టీక్యాప్ , ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రెండూ కలిపి కూడా ఉండవచ్చు. మల్టీక్యాప్ ఫండ్ మీకు అన్ని విభాగాల్లో స్థిరమైన వాటాను ఇస్తే, ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మార్కెట్ అవకాశాలను బట్టి డైనమిక్‌గా మారే సదుపాయాన్ని అందిస్తుంది. కేవలం ఒకే ఫండ్ పై ఆధారపడకుండా విభిన్న ఫండ్ హౌస్‌ల ద్వారా డైవర్సిఫై చేసుకోవడం సురక్షితమైన మార్గం!


Click it and Unblock the Notifications