Missed Your EMI ? ఇప్పుడు భారతదేశంలోని అనేక ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా రుణ రికవరీ వ్యవస్థను ప్రవేశపెట్టాయి. రుణం తీసుకున్న కస్టమర్ సకాలంలో EMI చెల్లించకపోతే.. AI ఏజెంట్ కాల్ లేదా సందేశం ద్వారా చెల్లింపును గుర్తు చేస్తుంది. దీనివల్ల బ్యాంకులు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.బాకీ ఉన్న రుణాలను తిరిగి పొందే ప్రక్రియ సులభతరం చేస్తున్నాయి.
కొన్ని AI వ్యవస్థలు కేవలం కాల్ చేయడం మాత్రమే కాకుండా.. AI-జనరేటెడ్ అవతారాలు కూడా వినియోగిస్తాయి. ఇవి వీడియో కాల్ ద్వారా కస్టమర్లను సంప్రదించి, అవసరమైతే రుణ చెల్లింపులు జరగాలని ప్రోత్సహిస్తాయి. ఈ అవతారాలు బ్యాంక్ ప్రతినిధి, న్యాయవాది లేదా ఇతర అధికార వ్యక్తి రూపంలో కనిపించవచ్చు. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ ద్వారా అవి మర్యాదగా ఉంటూ చట్టపరమైన భాషను మాత్రమే ఉపయోగిస్తాయి. అయితే అవసరమైన సమయంలో కఠినమైన రికవరీ చర్యలను సూచించగలవు.

AI ఏజెంట్ల ప్రధాన లాభం ఏమంటే.. వారు రోజు 24 గంటలు, అవిశ్రాంతంగా పని చేయగలరు. ఒక మానవ రికవరీ ఏజెంట్ నెలకు సుమారు 250 కేసులు మాత్రమే నిర్వహించగలడు, కానీ ఒక AI ఏజెంట్ 20 రెట్లు ఎక్కువ కాల్‌లను నిర్వహిస్తాడు. 40-60 శాతం తక్కువ ఖర్చుతో ఇది సాధ్యమేనని చెప్పవచ్చు. అయితే, ఈ వ్యవస్థ ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. వీడియో కాల్ లేదా సందేశం వచ్చినప్పుడు, అది నిజంగా బ్యాంక్ నుండి వచ్చిందా లేదా మోసగాడి నుండి అనేది తెలుసుకోవడం ముఖ్యమైంది. ఖాతా నంబర్లు, పాస్‌వర్డ్‌లు, OTPలు వంటి వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదు.
కస్టమర్ల కోసం ముఖ్యమైన సూచనలు:
కాల్ వచ్చినప్పుడు, అది నిజంగా బ్యాంక్ నుండి ఉందో లేదో తనిఖీ చేయండి.
వీడియో కాల్స్ ద్వారా ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు ఎప్పుడూ పంచుకోకండి.
EMI చెల్లింపులో ఆలస్యం ఉంటే, సమస్య పెరగకుండా వెంటనే బ్యాంకును సంప్రదించండి.
ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే ఈ AI వ్యవస్థను విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకా పూర్తి స్థాయిలో దీనిని స్వీకరించలేదు. ఏదేమైనా AI ఆధారిత రుణ రికవరీ వ్యవస్థ బ్యాంకులు, కస్టమర్ల రెండింటికీ లాభం కలిగించేలా రూపొందించబడింది. బ్యాంకులు సమయాన్ని, ఖర్చును తగ్గించగలరు, కస్టమర్లు వాయిదా చెల్లింపులో గడిచే సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చు. అయితే, కస్టమర్లు జాగ్రత్తగా ఉంటేనే ఈ వ్యవస్థ సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఏదేమైనా ఈఎంఐలు చెల్లించకపోతే మాత్రం కస్టమర్లు ఈ ఏఐ ఏజెంట్ల నుంచి టార్చర్ ఎదుర్కోవడం మాత్రం తప్పదు. ఎందుకంటే నీవు ఎంత తిట్టినా అది ఒపిగ్గా తన పని తాను చేసుకుంటుంది. నీవు ఫోన్ పెట్టేసినా మళ్లీ మళ్లీ టార్చర్ పెడుతూనే ఉంటుంది. కాబట్టి కస్టమర్లు అలర్ట్ కావడం మంచిది.


Click it and Unblock the Notifications