మూడో రోజు నష్టాల్లో మార్కెట్: రూ.1000 దిగువకు పడిపోయిన పేటీఎం, 12 నెలల్లో...
స్టాక్ మార్కెట్ వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు ముడిచమురు ధరలు, ద్రవ్యోల్భణ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో వరుసగా మూడో రోజు మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 18,000 పాయింట్లకు దిగువనే ఉంది. సెన్సెక్స్ 60,000 పాయింట్ల కిందకు పడిపోయింది. ఉదయం గం.11.15 సమయానికి సెన్సెక్స్ 500 పాయింట్లు క్షీణించి 59,595 పాయింట్ల వద్ద, నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,805 పాయింట్లవద్ద ట్రేడ్ అయింది.

మూడ్రోజుల్లో లక్షల కోట్లు
మార్కెట్లు వరుసగా మూడు రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ మిశ్రమ సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఒమిక్రాన్ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. సెన్సెక్స్ మూడు రోజుల్లోనే 1500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇన్వెస్టర్లు ఈ మూడు రోజుల్లో లక్షల కోట్లు నష్టపోయారు.

భారీగా నష్టపోయిన పేటీఎం
పేటీఎం స్టాక్ స్టాక్ నేడు స్వల్పంగా లాభపడింది. నేడు మధ్యాహ్నం గం.11.30 సమయానికి పేటీఎం రూ.6.70 పైసలు లేదా 0.67 శాతం లాభపడి రూ.1004.10 వద్ద ట్రేడ్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 65వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.1955, కనిష్టం రూ.990. ఇది కూడా నిన్ననే నమోదయింది.

26 శాతం నష్టం
పేటీఎం స్టాక్స్ గత మూడు వారాల్లోనే 26 శాతం మేర క్షీణించాయి. నిన్న ఈ స్టాక్ రూ.990కు కూడా పడిపోయింది. చివరకు రూ.1000కు దిగువనే రూ.997.35 వద్ద ముగిసింది. నిన్న మొదటిసారి నాలుగు అంకెల నుండి మూడంకెల స్థాయికి పడిపోయింది. నిన్నటి వరకు ఈ స్టాక్ గత 12 సెషన్‌లలో 11సార్లు నష్టాల్లో ముగిసింది. మొత్తంగా ఇరవై ఆరు శాతం పడిపోయింది. ఐపీవో ధరతో పోలిస్తే 54 శాతం క్షీణించింది. అయితే ఈ స్టాక్ వచ్చే పన్నెండు నెలల కాలంలో రూ.1875కు చేరుకుంటుందని మార్కెట్ నిపుణుల అంచనా. అప్పటికి కూడా ఇష్యూ ధరకు చేరుకోనట్లే.


Click it and Unblock the Notifications