గత కొంతకాలంగా మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మార్కెట్లు భారీ పతనంలోకి, అలాగే రికార్డ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. 2020 మార్చి చివరి వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు దశాబ్దాల స్థాయికి పడిపోయాయి. కరోనా మహమ్మారి తగ్గడంతో తిరిగి కోలుకొని, సెన్సెక్స్ 62,245 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. కరోనా థర్డ్ వేవ్, ఆ తర్వాత రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మళ్లీ మార్కెట్లు పడిపోయాయి. అయితే ఈసారి 50,000 దిగువకు మాత్రం రాలేదు. ఇప్పుడు తిరిగి 60,000ను చేరుకున్నాయి.

ఎప్పటికప్పుడు భిన్నం
ఒక వ్యక్తి ఎవరైనా గత రెండేళ్లుగా స్టాక్ మార్కెట్‌లో బాగా రాణిస్తున్న ట్రేడర్ అనుకోండి. అతను కొన్ని రోజులు లేదా వారాలలో స్టాక్స్‌లో స్వల్పకాలిక లాభాలను సంగ్రహిస్తాడు. స్టాక్స్ స్పష్టమైన ధోరణితో ముందుకు సాగినప్పుడు అతను రిటర్న్స్ పొందుతాడు. క్యాష్ మార్కెట్‌లో అతను ట్రేడింగ్ చేస్తున్నందున అతను స్పష్టమైన అప్ ట్రెండ్ లేదా బుల్లిష్ సెంటిమెంటును చూడాలి. కానీ కొద్ది నెలలుగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతంలోని పోకడ కనిపించడం లేదు.

ఇన్వెస్ట్ చేయవచ్చు
మొత్తానికి గత రెండేళ్లుగా స్టాక్ మార్కెట్లు భారీ ఊగిసలాటలో కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ ఈ రెండేళ్ల కాలంలో 26,000 పాయింట్ల నుండి 62,245 పాయింట్ల మధ్య కదలాడింది. అంటే 37000 పాయింట్లకు పైగా మధ్య కదలాడింది. అంటే ఇది భారీ ఊగిసలాటగా చెప్పవచ్చు. ఇలాంటి అనిశ్చితి మార్కెట్ సమయంలో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది భయపడుతుంటారు. మరికొంతమంది రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. అయితే రంగాలు, ఆయా స్టాక్స్‌ను పరిశీలించి స్వల్పకాలానికి లేదా దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్ రిస్క్‌తో కూడుకున్న విషయమని గుర్తించాలి.

ఆందోళనకరమే..
ప్రస్తుతం ద్రవ్యోల్భణం ఆందోళనకరంగా ఉంది. ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇందుకు చమురు ధరల పెరుగుదల ప్రధాన కారణం. సాధారణంగా బంగారం లేదా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు ద్రవ్యోల్భణం సమయంలో ఇది ప్రయోజనకరంగా మారుతుంది. ఇప్పుడు ద్రవ్యోల్భణం అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలోను ఆయా స్టాక్స్ లేదా రంగాలను ఎంపిక చేసుకొని ఇన్వెస్ట్ చేయవచ్చునని అంటున్నారు. దీర్ఘకాలం అయితే కొన్ని పరిస్థితులు మినహాయించి ఎక్కువగా లాభాలనే పొందుతారు. ఇక స్వల్పకాలం అయితే ఆ స్టాక్ ఇటీవల మార్కెట్ ఊగిసలాటలో ఎలా ఉంది, కంపెనీ సమీప భవిష్యత్తు ఏమిటి అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.


Click it and Unblock the Notifications