ఈ వారం మార్కెట్ ఎలా ఉండవచ్చు, బంగారం ధరలు పెరుగుతాయా?
గతవారం స్టాక్ మార్కెట్లు రికార్డ్ గరిష్టాలను తాకాయి. చివరకు కాస్త తగ్గినప్పటికీ సానుకూలంగా ముగిశాయి. ఈ వారం కూడా సూచీలు సరికొత్త శిఖరాలను తాకే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ 16000 వేల పాయింట్లను దాటే అవకాశాలు లేకపోలేదని, గతవారం నష్టపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ వారం పుంజుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. రిలయన్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ గతంలో వలె రూ.2000 దిగువకు పడిపోయే అవకాశాలు లేవని అంటున్నారు.

ఈ స్టాక్స్ ఎలా ఉండవచ్చంటే
ఐటీ షేర్లు లాభాల దూకుడును కొనసాగించ అవకాశాలు ఉన్నాయని నిపుణుల అంచనా. అసెంచర్ ఈ ఏడాది విక్రయ అంచనాలను పెంచింది. ఇది భారత ఐటీ సెంటిమెంట్‌కు మరింత బలం చేకూర్చుతుందని అంటున్నారు. ఆటో, టెలికం, మెటల్ రంగాల షేర్లు కాస్త సానుకూలంగా ఉండే అవకాశముంది. సిమెంట్ రంగ షేర్లు లాభాల్లో కొనసాగవచ్చు. లాక్ డౌన్ ముగిసి, అంతా సానుకూలంగా ఉండటంతో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ భారీ లాభాలను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

బ్యాంకింగ్ అదుర్స్
అంతర్లీనంగా సానుకూల ధోరణితో చమురు కంపెనీల షేర్లు స్థిరంగా ఉండవచ్చునని చెబుతున్నారు. అంతర్జాతీయంగా సానుకూల ధోరణి నేపథ్యంలో చమురు రంగం పైపైకి చేరుకోవచ్చు. బ్యాంకింగ్ రంగం కూడా దూకుడు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది బ్యాంకింగ్ రంగం భారీ లాభాలు నమోదు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

బంగారం, వెండి ధరలు
గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,795 వద్ద మద్దతు ధర ఉంటుందని, ఈ స్థాయి దిగువకు వస్తే రూ.46,280 స్థాయికి పడిపోవచ్చునని, పైకి చేరుకుంటే మాత్రం రూ.47,300 దాటవచ్చునని అంచనా వేస్తున్నారు. వెండి ఫ్యూచర్ రూ.68,300 దిగువకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వెండి ఈ వారం పైకి చేరుకునే అవకాశాలు తక్కువ అంటున్నారు.


Click it and Unblock the Notifications