2022లో మార్కెట్ ద్వారా 10% రిటర్న్స్, వచ్చే డిసెంబర్ నాటికి 70,000కు సెన్సెక్స్
భారత స్టాక్ మార్కెట్లు 2022లో సరికొత్త గరిష్టాలకు చేరుకోవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ ఏడాది కాలంలో దాదాపు 10,000 పాయింట్లు లాభపడింది. 2021 జనవరి 1వ తేదీన 47,869 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ క్రితం వారం రూ.57,011 వద్ద ముగిసింది. గత ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చిలో సెన్సెక్స్ 26,000 దిగువకు పడిపోయింది. అయితే 2020 డిసెంబర్ చివరి నాటికి కోలుకుంది. దీంతో 2021లో సెన్సెక్స్ 47,800 పైన ప్రారంభమైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో మళ్లీ క్షీణించినప్పటికీ, ఆ తర్వాత పుంజుకొని, 62,200 పాయింట్లతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఒమిక్రాన్, ద్రవ్యోల్భణ ఆందోళనలతో ఇటీవల మళ్లీ సెన్సెక్స్ క్షీణించింది.

ఏడాదిలో 9142 పాయింట్లు జంప్
సెన్సెక్స్ 2021ని 47,800 పైన ప్రారంభించింది. ఆ తర్వాత 62,245ను తాకి, 63,000 దిశగా పరుగు కనిపించింది. అంతలోనే ఒమిక్రాన్, ద్రవ్యోల్భణ ఆందోళనలు, ప్రాఫిట్ బుకింగ్ అంశాలు దెబ్బతీశాయి. సెన్సెక్స్ జనవరి 1వ తేదీ నుండి ఇప్పటి వరకు (డిసెంబర్ 20) 9,142 పాయింట్లు లేదా 19 శాతం లాభపడింది. అక్టోబర్ నెలలో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత క్షీణిస్తూ వస్తోంది. ఆల్ టైమ్ గరిష్టంతో ప్రస్తుతం 5,200 పాయింట్లకు పైగా తక్కువగా ఉంది. గత నాలుగైదు నెలల్లోనే దాదాపు సగం లాభపడింది. సెన్సెక్స్ ఈ ఏడాది కనిష్టం 44,923.08 పాయింట్ల వద్ద, గరిష్టం 62,245.43 పాయింట్లను తాకింది.

టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్
టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ (డిసెంబర్ 20) నాటికి ఇలా ఉంది. రిలయన్స్ రూ.1583118.61 కోట్లు, టీసీఎస్ రూ.1326923.71 కోట్లు, HDFC బ్యాంకు రూ.816229.89 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.766123.04, HUL రూ.524052.84 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.505547.14 కోట్లు, HDFC రూ.473922.86 కోట్లు, ఎస్బీఐ రూ.417448.70 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.416594.78 కోట్లు, విప్రో రూ.367126.39 కోట్లుగా ఉంది.
ప్రస్తుతం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,59,37,277.66 కోట్లుగా ఉంది.

65,000 పాయింట్లకు సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ 2022లో బుల్లిష్‌గా కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. త్వరలో సెన్సెక్స్ 65,000 పాయింట్లకు చేరుకోవచ్చునని అంటున్నారు. 2022 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 70,000 మార్కు చేరుకోవచ్చునని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. కరోనా మహమ్మారి తగ్గుదల, ఒమిక్రాన్ ప్రభావం అంతంత మాత్రమే ఉండటం, ఆర్థిక రికవరీ వేగవంతం, వ్యాక్సినేషన్ వేగవంతం వంటి అంశాలు మార్కెట్‌కు కలిసి వచ్చే అంశాలు అని చెబుతున్నారు. 2022లో మార్కెట్ 8 శాతం నుండి 10 శాతం రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.


Click it and Unblock the Notifications